ఆత్మకూర్.ఎస్, సెప్టెంబర్ 14: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. యూరియా కొరతతో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్.ఎస్ మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు ఆదివారం పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. ఆత్మకూర్.ఎస్ మండలంలోని నెమ్మికల్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం వీరికి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ కలిసికట్టుగా పని చేస్తూ పార్టీ పటిష్టతకు పాటుపడాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అత్యధిక స్థానాలు గెలుచుకునేలా కార్యకర్తలు పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.