నర్సంపేట, ఫిబ్రవరి27: టమాట రైతులు కష్టాల్లో పడ్డారు. మార్కెట్లో రోజురోజుకూ ధరలు పడిపోతుండడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బోరుబావులపై ఆధారపడి టమాట సాగు చేసిన రైతులు ధర లేక ఇబ్బందిపడుతున్నారు. టమాటకు గత నవంబర్, డిసెంబర్లో ఉన్న ధరలకు, ప్రస్తుతం ఉన్న ధరలకు పొంతన లేని పరిస్థితి నెలకొంది.
నవంబర్లో టమాట పెట్టే (ట్రే)ధర రూ.900 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.60 నుంచి రూ.80 మాత్రమే ధర పలుకుతున్నది. ఈధర కూడా తగ్గుముఖం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట, ఖానాపురం, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులు ఎక్కువగా టమాట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ధరతో కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి ఉందని పలు గ్రామాల రైతులు వాపోతున్నారు. కొందరు రైతులు కుటుంబ సభ్యులే కూలీలుగా మారి టమాటలు తెంపి దగ్గరలోని మార్కెట్కు తరలిస్తున్నారు.
సాధారణంగా వేసవి వస్తుంటే ధరలు విపరీతంగా పెరిగేవి.. అందుకు భిన్నంగా ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పడిపోవడంతో రవాణా ఖర్చులు కూడా మిగలని ఉందని రైతులు అంటున్నారు. గత మూడు నెలల క్రితం కిలో టమాట రూ.50నుంచి రూ60ధర పలకగా, ప్రస్తుతం అదే రూ.2-3 మాత్రమే ధర ఉన్నది. ఒక పెట్టె దాదాపు 25 కిలోలకుపైగానే ఉంటుంది. ప్రస్తుతం పెట్టె ధర రూ.80కి దాటకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేసేదీమీ లేక పలు గ్రామాల్లో రైతులు టమాటాలను ప్రజలకు పంచిపెడుతున్నారు. మరికొందరు మంది చేనులోనే వదిలేస్తున్నారు.