హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఏడో విడత గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని మరో ఐదు రోజుల్లో ప్రారంభించనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త సంతోష్‌కుమార్ తెలిపారు. భారతదేశాన్ని హరితమయంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు‘హర హైతో భారా హై- గ్రీన్ ఇండియా చాలెంజ్’ (భూమి పచ్చగా ఉంటే లోకం నిండుగా ఉంటుంది)లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.
భూమిని చల్లగా ఉంచేందుకు, జీవజాతుల ప్రాణాలను కాపాడేందుకు అందరం మొక్కలు నాటుదామని గురువారం ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. వాతావరణ సమత్యులత, జీవజాతుల ప్రాణాలను రక్షించడంలో పచ్చదనం పాత్ర చాలా కీలకమైనదని, ఈ పచ్చదనాన్ని కాపాడుకోవడానికే ‘హర హైతో భారా హై- గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఉద్యమం పుట్టిందని గుర్తుచేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్ఫూర్తితోనే పచ్చదనం పెంపునకు కృషి చేస్తున్నట్టు సంతోష్‌కుమార్ వెల్లడించారు.