శివ్వంపేట, అక్టోబర్ 16 : నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని ఉసిరికపల్లి బస్టాండ్ సమీపంలోని వాగు బ్రిడ్జి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం… శివ్వంపేట మండలంలోని శంకర్‌తండా, సీతారాంతండా, తాళ్లపల్లి తండాకు చెందిన 8 మంది కారులో వర్గల్ మండలం సీతారాంపల్లి తండాలో జరిగిన బంధువుల శుభకార్యానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో ఉసిరికపల్లి గ్రామశివారులోని వాగుబ్రిడ్జి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు గుంతల రహదారిపై అతివేగంగా వచ్చి అదుపుతప్పి వాగులోని చెట్టుకు ఢీకొని పడిపోయింది.
విషయం తెలుసుకున్న ఎస్ఐ మహిపాల్‌రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని స్థానికులు, జేసీబీ సహాయంతో వాగులోని కారును బయటకు తీశారు. రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ నామ్‌సింగ్‌కు తీవ్రగాయాలు కాగా, అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను తాళ్లపల్లితండాకు చెందిన ధనావత్ శివరాం (55), ధనావత్ దుర్గమ్మ (45), జెగ్య తండాకు చెందిన మాలోత్ అనిత (30), మాలోత్ బిందు (14), మాలోత్ శ్రావణి (12), భీమ్లాతండాకు చెందిన గుగులోత్ శాంతి (45), గుగులోత్ మమత (16)గా గుర్తించారు.
ఇందులో గుగులోత్ శాంతి, గుగులోత్ మమతలు తల్లీకూతురు కాగా, తాళ్లపల్లితండాకు చెందిన ధనావత్ శివరాం, ధనావత్ దుర్గమ్మ దంపతులు. డ్రైవర్ నామ్సింగ్ను నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఘటనాస్థలాన్ని తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి సందర్శించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో ఏడు మంది అక్కడికక్కడే మృతిచెందడం బాధాకరమని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. డ్రైవర్‌కు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
శివ్వంపేట రోడ్డు ప్రమాదంలోని మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి. ప్రమాదంలో ఒకేసారి ఏడుగురు మృతి చెందడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెల్పుతున్నాను. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి.
– మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
శివ్వంపేట రోడ్డు ప్రమాదంలో బంధువులైన ఏడుగురు ఒక్కసారిగా మృతి చెందడం బాధాకరం. మృతుల కుటుంబాలకు అండగా ఉంటా. ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలకు అండగా ఉండి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
– నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి