హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన 1,090 మంది పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గురువారం రాష్ట్రపతి, శౌర్య, సేవా పతకాలను ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 233 మంది సిబ్బందికి శౌర్య పతకం (జీఎం), 99 మంది సిబ్బందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (పీఎస్ఎం), 758 మందికి మెరిటోరియస్ సర్వీస్ పతకం (ఎంఎస్ఎం) ప్రదానం చేయనున్నది. వీటిలో తెలంగాణ పోలీసులకు 20 పతకాలు లభించాయి.
ఇందులో అగ్నిమాపక విభాగంలో నలుగురు, హోంగార్డు విభాగంలో ఇద్దరు, పోలీసు శాఖలో 16 మంది ఉన్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. కానిస్టేబుల్ కత్రావత్ రాజునాయక్ శౌర్యపతకం (జీఎం)కు ఎంపికయ్యారు. రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (పీఎస్ఎం)కు ఎంపికైన వారిలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సిద్ధయ్య మాయాతారి, హెడ్ కానిస్టేబుల్ హుస్సేన్ నిడమానూరి, మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ (ఎంఎస్ఎం)కు డీసీపీలు నల్లమల రవి, తొగరు కరుణాకర్, జే షేక్ షమీర్, కమాండెంట్ పుట్టా దేవిదాస్, ఆర్మ్డ్ పోలీస్ సబ్ఇన్స్పెక్టర్లు మేకల అబ్రహాం, షిండే ప్రకాశ్, ముదావత్ దశరథ్, రామ్దులర్సింగ్, ఏఎస్ఐలు మొహమ్మద్ మొయిజుద్దీన్, రాజేషుని శ్రీనివాసులు, రుద్ర కృష్ణకుమార్ ఉన్నారు.
వీరందరికి రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ అభినందనలు తెలియజేశారు. తెలంగాణ అగ్నిమాపక శాఖలో పతకాలు సాధించిన వారిలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఫైర్‌స్టేషన్‌కు చెందిన లీడింగ్ ఫైర్‌మన్ బీ గోపాల్‌రెడ్డి, జగిత్యాల్ జిల్లా మెట్పల్లి ఫైర్‌స్టేషన్‌కు చెందిన లీడింగ్ ఫైర్‌మన్ మహ్మద్ వహీదుల్లాఖాన్, ములుగు జిల్లా ములుగు ఫైర్ స్టేషన్‌కు చెందిన లీడింగ్ ఫైర్‌మన్ టీ నగేశ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన భద్రాచలం ఫైర్‌స్టేషన్ లీడింగ్ ఫైర్‌మన్ ఎండీ సాదిఖ్ ఉన్నారు.