రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆదేశించారు.
రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సమావేశమయ్యారు.గత ఏడాది వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెలా ఆదాయ పెంపును సమీక్షించుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకానెలా మంత్లీ టార్గెట్ను నిర్దేశించుకొని రాబడి సాధించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చిపెట్టే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జీఎస్టీ కలెక్షన్ పెంచేందుకు పక్కాగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్, ఆడిటింగ్ జరగాలని సూచించారు. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్తి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలని సీఎం సూచించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ ఎంత మేరకు ఉంది.. తగ్గించాలా.. పెంచాలా.. అనేది కూడా అధ్యయనం చేయాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు.