హైదరాబాద్, మార్చి 31(నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణ దరిమిలా కాంగ్రెస్‌లో లేఖల యుద్ధం కొనసాగుతున్నది. తమకంటే తమకు పదవి ఇవ్వాలంటూ అధికార పార్టీ నేతలు పోటాపోటీగా అధిష్ఠానానికి లేఖాస్ర్తాలు సంధిస్తున్నారు. వర్గాలు, జిల్లాలవారీగా విడిపోయిన నేతలు తమ బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ మొన్న ఎస్సీ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి లేఖ రాయగా.. ఆ తర్వాత తమకెందుకు ఇవ్వరంటూ ఎస్టీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. వర్గాల వంతు పూర్తికాగా తాజాగా జిల్లాలవారీగా నేతలు రంగంలోకి దిగారు. అందులో భా గంగా తాజాగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు కచ్చితంగా ఒక మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేఖాస్త్రం సంధించారు. ఈ లేఖపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సైతం సంతకం చేసినట్టు తెలిసింది. ఈ లేఖను అదే జిల్లాకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి ఢిల్లీకి వెళ్లి స్వయంగా అధిష్ఠానానికి అందించినట్టు తెలిసింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు మంత్రి పదవుల కోసం అధిష్ఠానానికి వరుసగా లేఖలు రాయడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
అధిష్ఠానంపై నిరసన గళం
మంత్రివర్గ విస్తరణ దాదాపుగా ఖాయం కావడంతో రేసులో వెనుకపడొద్దనే ఉద్దేశంతో ఒక్కొక్కరుగా అధిష్ఠానంపై నిరసన గళం వినిపిస్తున్నారు. క్యాబినెట్లో ఆరు ఖాళీలు మాత్రమే ఉండటం ఒక్కో పదవికి అర డజను మంది పోటీలో ఉండటంతో ఎవరికి వారు ముందుగానే జాగ్రత్త పడుతున్నట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. అందులో భాగంగానే తమ మనుసులో మాటను అధిష్ఠానం ముం దు పెట్టేందుకు లేఖాస్ర్తాలు సంధిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే మంత్రివర్గంలో చోటు దక్కించుకోబోయే కొందరి పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో పార్టీలోని వీరి ప్రత్యర్థి వర్గాలు అలర్ట్ అయ్యాయి. మాల వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామి పేరు ప్రచారంలోకి రావడంతో మాదిగ వర్గానికి చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదిపారు. ఇప్పటికే మాలలకు డిప్యూటీ సీఎం పదవితో పాటు స్పీకర్ పదవి కూడా ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ వారికే మంత్రి పదవి ఇస్తే తామేం కావాలంటూ మాదిగ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తున్నారు.
అందుకే ఈసారి మంత్రివర్గంలో మాలలకు కాకుండా మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలె యాదయ్య, తోట లక్ష్మీకాంతారావు, మందుల సామేలు డిమాండ్ చేశారు. అంతటితో ఆడకుండా నేరుగా అధిష్ఠానంపై లేఖాస్ర్తాన్ని ఎక్కుపెట్టారు. ఇక తామెందుకు తక్కు వ తిన్నామన్నట్టు లంబాడీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. లంబాడీ నేతలు బాలు నాయక్, రాంచందర్ నాయక్, నెహ్రూ నాయక్, కేతావత్ శంకర్.. సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వడంతో పాటు అధిష్ఠానానికి కూడా లేఖ రాశా రు. ఇక తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తమ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని మరో లేఖ సంధించారు. తమలో ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలంటూ మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సైతం సంతకం చేయడం కొసమెరుపు. వీరందరి లేఖలతో ఇప్పుడు అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.
సీఎం పర్యటనకు రాజగోపాల్‌రెడ్డి డుమ్మా
ఉగాది పండుగ రోజు హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి జరిపిన పర్యటనకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దూరంగా ఉన్నారు. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, అందులో రాజగోపాల్‌రెడ్డికి బెర్త్ ఖరారైందని ప్రచారం జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్ పాల్గొన్న బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లంతా హాజరైనప్పటికీ రాజగోపాల్‌రెడ్డి మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇది నల్లగొండ జిల్లా రాజకీయాలతోపాటు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి విషయంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డికి, రాజగోపాల్‌రెడ్డికి మధ్య పోటీ ఏర్పడటం.. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన సతీమణి పద్మావతికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ పట్టుపట్టిన విషయం తెలిసిందే. అందుకే ఉత్తమ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరుకాలేదని చర్చ నడుస్తున్నది.