రాయపోల్, ఫిబ్రవరి 13 : ప్రస్తుత గ్లోబల్ యుగంలో విద్యార్ధులు ఇంగ్లీష్‌పై పట్టు పెంచుకోవడం అత్యంత అవసరమని ఇంగ్లీష్ ఉపాధ్యాయులు నర్సింలు గౌడ్, సంజీవులు అన్నారు. రాయపోల్ మండలం బేగంపేట ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఇంగ్లీష్ డే (English Day) నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో ఇంగ్లీష్ భాష ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా విద్యార్థులు రంగవల్లులు వేయగా, సందేశాత్మక చిత్రాలు ఆకట్టుకున్నాయి.
ఇంగ్లీష్ డేను పునస్కరించుకొని విద్యార్థులు ఇంగ్లీష్‌లో ప్రసంగాలు ఇచ్చారు. కొందరు కవితా పఠనం, సంభాషణలు, వ్యాసరచన వంటి కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు, సాంకేతిక రంగాల్లో రాణించాలంటే ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం అవసరమని పేర్కొన్నారు.
రోజువారీ జీవితంలో ఇంగ్లీష్ మాట్లాడే అలవాటు పెంపొందించుకోవాలని విద్యార్ధులకు సూచించారు. ప్రధానోపాధ్యాయులు ప్రమీల ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఇంగ్లీష్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.