Fatty Liver | మన జీవన విధానంలో, ఆహారంలో వచ్చిన మార్పులు మనల్ని అనేక అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. వాటిలో ఫ్యాటీ లివర్ సమస్య కూడా ఒకటి. ఈ సమస్య ఇప్పుడు సాధారణ సమస్యలాగా మారింది. ఫ్యాటీ లివర్ లో రెండు రకాలు ఉన్నాయి. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాల్ తక్కువ తాగే వారిలో లేదా అసలు తాగని వారిలో కూడా మారిన ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యను ముందుగా గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఈ సమస్యను కనుక నిర్లక్ష్యం చేస్తే ఇది కాస్తా నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్, సిర్రోసిస్ తో పాటు చివరగా కాలేయ క్యాన్సర్ గా మారే అవకాశం ఉంది. కనుక కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా అవసరం.
మన రోజువారి అలవాట్లపై శ్రద్ద పెట్టడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య క్యాన్సర్ గా మారకుండా మనం జాగ్రత్తపడవచ్చు. ఫ్యాటీ లివర్ సమస్య తగ్గడానికి, ఈ సమస్య రాకుండా నివారించడానికి మన జీవనశైలిలో ఎటువంటి మార్పులు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. శీతల పానీయాలు, బిస్కెట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని తీసుకోవడం మానేయాలి. ఇవి నేరుగా కాలేయంలో కొవ్వును పెంచుతాయి. చక్కెర కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక వీటికి బదులుగా డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు వంటి వాటిని తీసుకోవాలి. అలాగే రోజూ వ్యాయామం చేయాలి. గంటల తరబడి కూర్చోకూడదు. ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వారానికి 150 నిమిషాలు నడక, స్లైకింగ్, ఈత వంటి వ్యాయామాలు చేయాలి.
నూనెలో బాగా వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వేయించిన ఆహారాలు, పిజ్జాలు, బర్గర్లు వంటి వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయంపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తక్కువ సమయంలోనే కాలేయ క్యాన్సర్ గా మారే అవకాశం ఉంది. కనుక వీటికి బదులు ఆలివ్ ఆయిల్ తో చేసిన వంటకాలు తీసుకోవడం, చేపలు, అవకాడో వంటి వాటిని తీసుకోవడం చేయాలి. అలాగే శరీర బరువును కూడా అదుపులో ఉంచుకోవాలి. అధిక శరీర బరువు ఫ్యాటీలివర్ సమస్య రావడానికి ప్రధాన కారణం. అధిక బరువు, పొట్ట చుట్టూ ఎక్కువగా పేరుకుపోయిన కొవ్వు ఇన్సులిన్ నిరోధకతను, ఫ్యాటీ లివర్ సమస్యను పెంచుతుంది. కనుక శరీర బరువును ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.
ఎక్కువగా నీరు తాగడం, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల శరీర బరువు ఎల్లప్పుడూ అదుపులో ఉంటుంది. ఇక మద్యపానం, ధూమపానం రెండూ కూడా ఫ్యాటీ లివర్ కు దారి తీస్తాయి. ఇవి రెండూ కాలేయానికి ప్రధాన శత్రువులు అని చెప్పవచ్చు. ఈ అలవాట్లను కొనసాగించడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యతో పాటు కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ అలవాట్లను వెంటనే మానేయడం మంచిది. వీటికి బదులుగా నీటిని ఎక్కువగా తాగడం, బ్లాక్ టీ, హెర్బల్ టీలను తాగడం అలవాటు చేసుకోవాలి. ఫ్యాటీ లివర్ సమస్య నెమ్మదిగా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కనుక మన రోజూ అలవాట్లల్లో ఈ మార్పులు తప్పకుండా చేసుకోవాలి. ఈ అలవాట్లను పాటించడం వల్ల కాలేయ ఆరోగ్యంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.