Komatireddy Rajagopal Reddy | సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 5: సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు రూ.5 వేల కోట్ల నిధులు తీసుకుపోయినప్పటి నుంచి తనకు నిద్ర పట్టడంలేదని, పదవులు, నిధులు అన్నీ తీసుకుపోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వాఖ్యలుచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల, లచ్చమ్మగూడెంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌లో చేరినప్పుడు, భువనగిరి ఎంపీ సీటు గెలిపించినప్పుడు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ద్రోహం చేశారని మండిపడ్డారు.
ఎవరి కాళ్లు మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టంచేశారు. పార్టీలు మారిన జూనియర్లకు మంత్రి పదవులు ఇస్తూ సీనియర్లను అవమానిస్తరా? అని ప్రశ్నించారు. ఎల్బీనగర్ నుంచి పోటీచేస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పినా మునుగోడు ప్రజల అభివద్ధి కోసం ఇక్కడి నుంచి పోటీచేశానని స్పష్టంచేశారు. అవసరమైతే మునుగోడు ప్రజల కోసం రాజీనామాకు సిద్ధమని తెలిపారు. ఇందిరమ్మ పథకంలో ఇండ్లురాని పేదలు బాధపడవద్దని, అర్హులందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు.