Jupally Krishna Rao | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పార్టీలో చేరికపై ఆయనకు కాంగ్రెస్ అధిష్ఠానం గట్టి షాక్ ఇచ్చింది. ‘సభ వద్దు.. ఏం వద్దు.. ఢిల్లీకి వచ్చి కండువా కప్పుకొని పార్టీలో చేరిపోండి’ అని ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. ‘ప్రియాంకగాంధీ టైమ్ ఇవ్వడం లేదు.. ఈ నెల 20న కొల్లాపూర్‌లో జరగాల్సిన సభను రద్దు చేసుకోండి’ అని ఆదేశించినట్టు సమాచారం. దీంతో జూపల్లితోపాటు ఆయన క్యాడర్‌కు గట్టి షాక్ తగిలినట్టయ్యింది.
ఎంతో ఆర్భాటంగా పార్టీలో చేరాలనుకున్న ఆయన ఆశలపై అధిష్ఠానం నీళ్లు కుమ్మరించటం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. దీంతో జూపల్లి పరిస్థితి ‘నవ్వేటోని ముందు జారిపడ్డ’ చందంగా మారిందనే ప్రచారం జరుగుతున్నది. మొదటి నుంచి కాంగ్రెస్‌లో జూపల్లి చేరికను వ్యతిరేకిస్తున్న పార్టీ సీనియర్ల ముందు పరువుపోయిందని ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. అధిష్ఠానం తీరుతో జూపల్లి తీవ్ర ఆసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై గాంధీభవన్‌లో జూపల్లిపై జోకులు పేలుతున్నాయి. అధిష్ఠానం ఢిల్లీలో ఉంటే పరిస్థితి ఎట్లుంటదో ఆయనకు తొందరగానే బోధపడిందని సెటైర్లు వేస్తున్నారు.
సభ రద్దు.. జూపల్లి ఆవేదన
ప్రియాంకగాంధీ సమయం ఇవ్వకపోవడం, సభను రద్దు చేసుకోవాలంటూ అధిష్ఠానం ఆదేశించటంతో ఏం చేయలేని పరిస్థితులో ఈ నెల 20న కొల్లాపూర్‌లో జరగాల్సిన సభను జూపల్లి రద్దు చేసుకొన్నారు. అన్యమనస్కంగానే ఆయన సభను రద్దు చేసినట్టు తెలిసింది. సభ రద్దుపై ఆయన తీవ్ర ఆవేదనతో ఉన్నట్టు సమాచారం. దీనిపై రాష్ట్ర పార్టీ పెద్దలతో ఆయన వాదనకు దిగినట్టు తెలిసింది. మాట ఇచ్చి తప్పించుకోవడం ఏంటని, ఒకవేళ వీలుకాకపోతే తనకు ముందే చెప్తే సభను పెట్టుకొనేవాడినే కాదని జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సమయం ఇచ్చిన తర్వాత సభ రద్దు చేయడంతో జూపల్లి అనుచరులు కూడా తీవ్ర నిరాశకు గురైనట్టు సమాచారం. పార్టీలో చేరకముందే ఆంక్షలేమిటని మండిపడుతున్నట్టు తెలిసింది. జూపల్లి అసంతృప్తి వ్యక్తం చేయడంతో మళ్లీ ఈ నెల 30న సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అయితే ఈ సభకు కూడా ప్రియాంకగాంధీ వస్తారో లేదో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రూ. 50 కోట్లు ఖర్చయినా సరే… జూపల్లిని ఓడిస్తా
కాంగ్రెస్ పార్టీలో జూపల్లి చేరికను ఆ జిల్లా సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తున్న తమను కాదని, ఇప్పుడే పార్టీలో చేరుతున్న జూపల్లికి ప్రాధాన్యం ఇవ్వడంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పార్టీలో చేరడానికి జూపల్లి పెట్టిన కండిషన్లపై సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ ఆధిపత్యం తనకే ఇవ్వాలని, తాను చెప్పిన వాళ్లకు టికెట్లు ఇవ్వాలని జూపల్లి షరతులు పెట్టినట్టు సమాచారం. దీంతో ఆయనపై రాజకీయంగా ప్రతీకారం తీర్చుకొనేందుకు సీనియర్లు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ తరఫున జూపల్లి ఎన్నికల్లో పోటీచేస్తే ఓడించేందుకు ఆ పార్టీ నేతలే సిద్ధమవుతున్నారనే ప్రచారం సాగుతున్నది. నాగం జనార్ధన్‌రెడ్డి, చిన్నారెడ్డి, జగదీశ్వర్‌రావు బహిరంగంగానే జూపల్లిపై విమర్శలు గుప్పిస్తున్నారు. గత ఎన్నికల్లో గెలవని జూపల్లి ఇప్పుడెలా గెలుస్తారని నాగం ఎద్దేవా చేశారు. కొల్లాపూర్ సీటును ఆశిస్తున్న సీనియర్ నేత జగదీశ్వర్‌రావు ఓ అడుగు ముందుకేసి.. పార్టీ జూపల్లికి టికెట్ ఇస్తే రూ.50 కోట్లు ఖర్చుపెట్టయినా సరే ఆయనను ఓడిస్తానని శపథం చేసినట్టు తెలిసింది. ఈ విధంగా ఓవైపు అధిష్ఠానం నుంచి ఝలక్‌లు, మరోవైపు సీనియర్ల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతుండటంతో జూపల్లి తీవ్ర అంతర్మథనంలో పడినట్టు సమాచారం.