Jeevan Reddy | జగిత్యాల, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : ఆత్మగౌరవానికి విలువలేని కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేయడం సాధ్యం కాదని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు. 20 నెలలుగా పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు మానసిక క్షోభకు గురిచేశాయని ఆవేదనచెందారు. ఈ క్రమంలోనే ఈ నెల 25న ఆ పార్టీ సభ్యత్వానికి, ఏఐసీసీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. పదేండ్లపాటు ప్రతిపక్షంలో మొక్కవోని దీక్షతో పోరాటం చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే.. ఇతరులను అందలం ఎక్కించి, కార్యకర్తలు, నాయకుల మనోభావాలను దెబ్బతీయడం బాధాకరమని వాపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో.. ఫిబ్రవరి 16నే కాంగ్రెస్‌లో కొనసాగడం ఇబ్బందికరంగా ఉందని ప్రకటించానని గుర్తుచేశారు.
40 ఏండ్లుగా పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవడం బాధాకరంగానే ఉందని చెప్పారు. పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్తగా కొనసాగుతూనే ప్రజల పక్షంలోనూ అంతే నిబద్ధతతో నిలబడ్డానని తెలిపారు. ప్రజల కోసం అధికార పార్టీలో ఉండి కూడా పోరాటం చేసినట్టు గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సకాలంలో రుణాలు చెల్లించినవారికి ప్రోత్సాహకంగా రూ.5వేల చెల్లిస్తామని హమీ ఇచ్చి జీవో జారీ చేయగా.. జగిత్యాలలో ఒక బ్యాంకు అధికారులు అమలు చేయకపోవడంతో రైతులకు ప్రోత్సాహకం అందించాలని డిమాండ్ చేస్తూ మంత్రి హోదాలో ధర్నా చేశానని గుర్తుచేశారు. విద్యుత్ అదనపు బిల్లు ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీగా సైతం పోరాటం చేశానని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ జగిత్యాల ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడాన్ని విభేదించానని తెలిపారు. రాహుల్‌గాంధీ పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ సూచించిన పాంచ్ న్యాయ్ సూత్రాలకు విఘాతం కలుగుతుందని అధిష్ఠానానికి వివరించానని పేర్కొన్నారు.
అయినా పార్టీ అధిష్టానం వైఖరిలో మార్పు రాలేదని, ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇస్తూ, పదేండ్ల పాటు పార్టీ కోసం పోరాటం చేసిన కార్యకర్తలు, నాయకుల మనోభావాలను దెబ్బతినేలా చేశారని మండిపడ్డారు. జగిత్యాలతో పాటు రాష్ట్రంలో మరో 9 నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే ఉందని తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అంతర్గత విషయాల నుంచి మినహాయించాలని డిమాండ్ చేశానని చెప్పారు. శనివారం మంత్రులు శ్రీధర్‌బాబు, లక్ష్మణ్‌కుమార్ వచ్చి పార్టీకి రాజీనామా చేసే విషయంలో పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారని, అయితే సమస్యకు పరిష్కారం, ఆత్మగౌరవం లేనప్పుడు పార్టీలో కొనసాగడం సరికాదని వారికి స్పష్టం చేశానని చెప్పారు. ‘నా స్థానంలో మీరుంటే మీరేం చేస్తారని, వారిని ప్రశ్నిస్తే.. వారి వద్ద సైతం సమాధానం కరువైందని’ పేర్కొన్నారు. పదేండ్లు ప్రతిపక్షంలో అష్టకష్టాలు పడ్డామని, అధికారంలోకి వచ్చి పదవులు, గౌరవం లభించే సమయంలో ఎవడో శత్రువొచ్చి నోటికాడి ముద్ద లాక్కుంటే ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోవాలని సూచించారు. జగిత్యాల నియోజకవర్గంతో తన అనుబంధం విడదీయలేనిదని, తాను ఎమ్మెల్యేగా గెలిచినా, ఓడినా ఇక్కడి ప్రజలు ఆదరిస్తూనే వచ్చారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో తాను బలపర్చిన వారిని గెలిపించారని గుర్తుచేశారు. కార్యకర్తలు, నాయకులు, శ్రేయాభిలాషులతో ఈ నెల 25న ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 27 నెలల కాలంలో ప్రజాహిత అంశాలను విస్మరించడం బాధ కలిగిస్తున్నదని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణకు ప్రాణహిత నీళ్లే ఆధారమని, ఆ నీళ్లను ఒడిసిపట్టే విషయంలో ప్రభు త్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని మం డిపడ్డారు. కాంగ్రెస్ తమ్మిడిహట్టి నిర్మించను న్నట్టు మ్యానిఫెస్టోలో పేర్కొందని, మూడో సారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో దీనికి సరైన నిధులు కేటాయించకపోవడం సరికాదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించకపోవడం సరికాదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్న సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఫ్యాక్టరీ, మూసీ సుందరీకరణ ప్రాణహిత జలాలపైనే ఆధారపడి ఉన్నాయని గుర్తుచేశారు. ప్రాణహిత నీటి వినియోగంపై ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు. వర్షాభావం ఏర్పడితే ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా వరకు కరువు కోరల్లో చిక్కుకుంటాయని ఆవేదన వ్యక్తంచేశారు.
42 ఏండ్లు కాంగ్రెస్ కోసం పనిచేసిన తనకు పార్టీలో అన్యాయం జరగడానికి సీఎం రేవంత్‌రెడ్డిదే బాధ్యత అని మాజీమంత్రి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి, ఎల్పీ లీడర్‌గా ఉన్న భట్టి విక్రమార్క సీఎం.. డిప్యూటీ సీఎం అయినప్పుడు శాసన మండలిలో ఐదేండ్లపాటు ఒంటరి పోరాటం చేసిన తనకు మంత్రి అయ్యే యోగ్యత లేదా..? అని ప్రశ్నించారు. 20 నెలల గడువు ఉన్నప్పటికీ మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. గడువు ముగిసిన తర్వాత మరోసారి ఎమ్మెల్సీ స్థానాన్ని ఎందుకు తనకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనిలో సీఎం రేవంత్‌రెడ్డికి పాత్ర లేదా అని ప్రశ్నించారు. తన ప్రత్యర్థి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకొని ప్రాధాన్యం ఇచ్చి, కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయేలా చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డిదే ప్రధానపాత్ర అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లో రాహుల్‌గాంధీ ఆశయాల కంటే సీఎం రేవంత్‌రెడ్డి ఫిరాయింపులకే ఎక్కువ విలువ ఇస్తున్నట్టు కనిపిస్తున్నదని జీవన్‌రెడ్డి ఆరోపించారు. రాహుల్‌గాంధీ పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ పాంచ్‌న్యాయ్ సూత్రాలను రూపొందించగా, వాటికి విరుద్ధంగా సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ ఆశయాల కంటే రేవంత్‌రెడ్డి ఫిరాయింపులకే పార్టీలో విలువ ఎక్కువ ఉందని విచారం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చేపడుతున్న పార్టీ ఫిరాయింపుల వల్ల రాహుల్‌గాంధీ ఆశయాలకు జాతీయ స్థాయిలో ఇబ్బందులు వస్తున్నాయన్న విషయాన్ని అధిష్టానం గుర్తించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాక కార్యకర్తలు, నాయకుల అభిప్రాయంతో కార్యాచరణను రూపొందించుకుంటామని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా తానెప్పుడు ప్రజాపక్షంలోనే ఉంటానని చెప్పారు. ప్రజలకు ఏ పార్టీ వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది, ప్రజల సమస్యలను ఏ పార్టీ పరిష్కరిస్తుందని నమ్మకం కలుగుతుందో ఆ పార్టీతోనే తన ప్రయాణం కొనసాగే అవకాశాలున్నాయని చెప్పారు. ఏప్రిల్‌లో జగిత్యాల, ఇతర నియోజకవర్గాల్లో ప్రజలను కలిసే అవకాశాలున్నాయని స్పష్టంచేశారు.