కాజీపేట, నవంబర్ 5: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లను అమ్ముకొన్న నాయిని రాజేందర్‌రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టికెట్ కేటాయించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని డీసీసీబీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జంగా రాఘవరెడ్డి మండిపడ్డారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో వరంగల్ పశ్చిమ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.
కార్యక్రమానికి హాజరైన రాఘవరెడ్డి మాట్లాడుతూ.. పార్టీని కష్టకాలంలో ఆదుకున్న వారికే టికెట్ ఇస్తామని గతంలో రాహుల్ గాంధీ చెప్పారని, ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చి తనలాంటి సీనియర్ నాయకులకు అన్యాయం చేయడం సరికాదని అన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గి అధిష్ఠానం గెలిచే వ్యక్తులకు టికెట్ ఇవ్వకుండా తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. వరంగల్ పశ్చిమలో గెలిచే సత్తా తనకున్నదని, పార్టీ పునరాలోచించి టికెట్ కేటాయించాలని కోరారు. ఒకవేళ తనకు కాంగ్రెస్ టికెట్ రాకుంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీలో ఉంటానని స్పష్టంచేశారు.