హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నిజమైన పూలే వారసుడని, బీసీల ఆత్మగౌరవం కాపాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్సేనని, దీనిని బీసీ బిడ్డలు, నేతలు గుర్తించి పార్టీలోకి తరలిరావాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో బీసీలకు తెలంగాణలో పెద్దపీట వేసినవారే లేరని, నేడు సీఎం కేసీఆర్ మాత్రమే బీసీలకు అత్యుత్తమ ప్రాధాన్యం ఇస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో కొనియాడారు. తెలంగాణ ఉద్యమకారులు, బీసీ నేతలు స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ వంటి వారు టీఆర్ఎస్లోకి తిరిగి రావడంపై హర్షంవ్యక్తం చేశారు. తన 25 ఏండ్ల రాజకీయ జీవితంలో బీసీలకు ఇంతలా సేవ చేసిన, బీసీ పక్షం వహించిన సీఎంను చూడలేదని, పూలే, అంబేదర్ ఆశయాలను సంపూర్ణంగా ఆకళింపు చేసుకొని, ఆచరణలో పెడుతున్న ఏకైక నేత కేసీఆర్ అని, బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక కేసీఆర్ అని అభివర్ణించారు. వలసవాద, తెలంగాణకు సంబంధం లేని పార్టీల్లో ఆత్మగౌరవం చంపుకొని ఉండాల్సిన అవసరం బీసీ నేతలకు, బిడ్డలకు లేదని, అలా ఉన్నవారంతా టీఆర్ఎస్లోకి రావాలని ఆహ్వానించారు. వెనకబడిన వర్గాల ఆత్మగౌరవ భవనాల కోసం రాష్ట్ర రాజధానిలో వేల కోట్ల విలువైన 83 ఎకరాల భూమి, వందల కోట్ల నిధులు ఇవ్వడమే కాకుండా, విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. ప్రపంచస్థాయి గురుకులాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లతో సహా కల్యాణలక్ష్మి, ఆసరా తదితర పథకాల ద్వారా అత్యధికంగా బీసీలకే లబ్ధి చేకూర్చుతున్నారని చెప్పారు. చట్టసభలతోపాటు స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రాతినిధ్యం కల్పిస్తున్న టీఆర్ఎస్లో మాత్రమే బీసీల ఆత్మగౌరవానికి స్థానం ఉన్నదని వివరించారు.