పలు రైళ్లు పునరుద్ధరణ.. కొన్ని రద్దు
ఏపీలో పరిస్థితిపై అధికారుల సమీక్ష
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): శుక్రవారంనాటి ఉద్రిక్తతల తర్వాత సికింద్రాబాద్ స్టేషన్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. శుక్రవారం రాత్రి నుంచే పలు రైళ్లను పునరుద్ధరించిన అధికారులు.. శనివారం ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలను కొనసాగించారు. కాకినాడ, విజయవాడ వంటి ప్రాంతాల్లో ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు శనివారం ఆందోళనకు యత్నించడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీలోని ప్రధాన రైల్వేస్టేషన్లకు వెళ్లే రైళ్లను సికింద్రాబాద్‌లోనే నిలిపివేశారు. అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఇప్పటికే 17 రైళ్లను రద్దు చేశామని అధికారులు తెలిపారు. ఇతర మార్గాల్లో రెండు రైళ్లను పునరుద్ధరించామని, ఏడు రైళ్లను రీషెడ్యూల్ చేశామని పేర్కొన్నారు. రెండు ప్రత్యేక రైళ్లతోపాటు, ఒకే మార్గంలో ప్రయాణించే నరసాపూర్-తిరుపతి, కాచిగూడ-నరసాపూర్, సికింద్రాబాద్-షాలిమార్ రైళ్ల రాకపోకలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. రైళ్ల రద్దు, రాకపోకలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 040-27786666 నంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
పరిస్థితి అదుపులోనే ఉంది : రైల్వే డీజీ సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లలో భద్రతను పెంచామని రైల్వే డీజీ సందీప్ శాండిల్య తెలిపారు. సికింద్రాబాద్ సహా అన్నిచోట్ల పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని చెప్పారు. శుక్రవారం నాటి హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 33 మందిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నగర పోలీసుల కలిసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.