హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణాశాఖ చెక్ పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగియగానే రాష్ట్ర సరార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో రవాణాశాఖకు మొత్తం 15 చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇందులో వాంకి డి, అలంపూర్, కృష్ణా, సాలూర, ఆదిలాబాద్, జహీరాబాద్, మద్నూర్, భైంసా, నాగార్జునసాగర్, విష్ణుపురం, కోదాడ, కల్లూరు, అశ్వారావుపేట, పాల్వంచ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. మరొకటి కామారెడ్డిలో ఉన్నది. వీటిల్లో ఒకోచోట 10-15 మంది అంటే 150 మందికిపైగా అధికారులు, ఉద్యోగులు ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలు, పర్మిట్లను చెక్ తనిఖీ చేయాలి.
ఇవి అవినీతి కేంద్రాలుగా మారాయన్న ఆరోపణలు దశాబ్దాలుగా ఉన్నాయి. ఒకో చెక్‌పోస్టు దగ్గర పర్మిట్ లేని వాహనాల నుంచి నామమాత్రపు జరిమానాలే విధిస్తున్నారు. రాష్ట్రంలోకి వచ్చాక జిల్లాల్లో అంతకు ఎన్నో రెట్లు జరిమానా వసూలవుతున్నట్టు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యం, రవాణా పర్మిట్లు సహా వాహనాల అనుమతులు ఆన్లైన్లోనే ఇస్తున్నారు. ఈ క్రమంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో రవాణాశాఖ చెక్ పోస్టులు అవసరం లేదని కేంద్రం గతంలోనే సర్యులర్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టింది. ఎన్నికల కోడ్ రావడానికి ముం దు ఉన్నతాధికారులు చెక్ తొలగింపుపై సరార్ ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తున్నది. చెక్‌పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులను జిల్లా లు, హైదరాబాద్‌లో వినియోగించుకోవాలని రవాణాశాఖ భావిస్తున్నట్టు సమాచారం.
రవాణాశాఖ వాహనదారుల నుంచి లైఫ్ ట్యాక్స్‌తో పాటు యూజర్ చార్జీలను కూడా వసూలు చేస్తున్నది. ఏటా ఈ మొత్తం రూ.130 కోట్ల వరకు వస్తున్నది. రవాణాశాఖకు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భవనాలు సరిగా లేవని, కొత్త భవనాలు, కంప్యూటర్లు వంటి అవసరాలకు నిధులు కావాలని ఆశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోడ్‌కి ముందు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార దృష్టికి తీసుకెళ్లారు. యూజర్ చార్జీల ఆదాయాన్ని కొత్త భవనాలకు ప్రతిపాదించగా సర్కారు ఆమోదం తెలిపినట్టు తెలిసింది. ఎన్నికల కోడ్ ముగిశాక అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.