Special Police | హైదరాబాద్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): ఏక్పోలీస్ విధానం అమలు కోసం కుటుంబసభ్యులతో కలిసి బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. యూనిఫాంలతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో బెటాలియన్ కానిస్టేబుళ్లను భయభ్రాంతులకు గురిచేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి చర్యలు చేపట్టింది. ఆర్టికల్ 311 ప్రకారం ఆదివారం 10 మంది కానిస్టేబుళ్లను విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో ఆంక్షలు విధించింది. హైదరాబాద్లో 24గంటల పాటు భారతీయ న్యాయ సురక్ష సంహిత 2023 సెక్షన్ 163 అమలు చేయనున్నట్టు నగర పోలీస్ కమిషనర్ ప్రకటించారు. 27వ తేదీ సాయంత్రం 6గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఈ సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. దీని ప్రకారం ఐదుగురు అంత కంటే ఎక్కువ మంది గుమిగూడవద్దని, ధర్నాలు, సమావేశాలు, ర్యాలీలు ఏర్పాటు చేయవద్దని స్పష్టంచేశారు. కానీ..బెటాలియన్ కానిస్టేబుళ్లు మాత్రం సర్కారు ఉక్కుపాదంపై వెనక్కి తగ్గేది లేదని.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందలేమని పోరుబాట పడుతున్నారు.
శనివారం భార్యాపిల్లలతో రోడ్డెక్కిన కానిస్టేబుళ్లపై తెలంగాణ పోలీసు శాఖ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెటాలియన్లలో ఒకే రోజు 39 మందిని సస్పెన్షన్ చేస్తూ అర్ధరాత్రి వేళ ఉత్తర్వులు ఇచ్చింది. తమ సహోద్యోగులు సస్పెన్షన్ గురికావడంతో వారికి బెటాలియన్ కానిస్టేబుళ్లంతా బాసటగా నిలిచారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ సస్పెన్షన్ను వెనక్కి తీసుకోవాలని బెటాలియన్ల ముట్టడి చేపట్టారు. గంటలకొద్దీ బెటాలియన్ ముఖద్వారం వద్ద నిరసన చేపట్టినా.. కమాండెంట్ పట్టించుకోకపోవడంతో పట్టరాని కోపంతో రోడ్డెక్కారు. అనంతరం రాత్రి వేళ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అయినప్పటికీ సర్కారులో చలనం రాకపోవడంతో ఉద్యమ కార్యాచరణ ప్రకారం సోమవారం సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి బెటాలియన్ కానిస్టేబుళ్లు నగరానికి బయలుదేరినట్టు సమాచారం. పోలీసుల ఆంక్షలు, తనిఖీలు నడుమ.. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ నగరబాట పట్టిన బెటాలియన్ కానిస్టేబుళ్ల సచివాలయ ముట్టడి ఎక్కడికి దారితీస్తుందోనని సర్వత్రా ఆందోళన నెలకొన్నది.
39 మందిపై ఆర్టికల్ 311 ప్రయోగం
ఏక్ పోలీసు వ్యవస్థను అ మలు కోసం కుటుంబసభ్యులతో కలిసి ఆందోళన చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుళ్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిం ది. దొడ్డిదారిన అర్ధరాత్రి ఆర్టికల్ 311 ప్రయోగించింది. 39 మంది బెటాలియ న్ కానిస్టేబుళ్లను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసింది. ఆందోళనలకు ప్రేరేంపించిన వారిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.