మహబూబ్‌నగర్, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఉద్దేశంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఇందుకోసం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ నాయకులు రాత్రిళ్లు ఓటర్ల ఇండ్లకు వెళ్లి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. అధికారులు పంపిణీ చేయాల్సిన ఇందిరమ్మ చీరలను, కల్యాణలక్ష్మీ చెక్కులను కాంగ్రెస్ నాయకులు అందజేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా.. అధికారులు కిమ్మనడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. మాట వినకుంటే సదరు నాయకుల వ్యాపారాలపై అధికారులతో దాడులు చేయించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రలోభాలు, బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భయపడరని స్పష్టంచేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధిచెప్తారని హెచ్చరించారు.