హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ డీఏలు చెల్లించాలని, పీఆర్సీ అమలు, మెడికల్ బిల్లుల పరిష్కారానికి త్వరలో ఇందిరాపార్కులో ధర్నా నిర్వహించాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ అసోసియేషన్(ఎస్జీటీయూ) తీర్మానించింది. ఎస్జీటీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించగా.. హెల్త్‌కార్డులు, సీపీఎస్ విధానం రద్దు సహా ఇతర సమస్యలపై చర్చించారు.
ఎస్జీటీలకు టీచర్ ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని, 10వేల పీఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరుచేయాలని, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల మధ్య వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం, ఉద్యోగ నేతలు పాల్గొన్నారు.