హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): దృష్టిలోపాలు, కంటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండోవిడత ఈ నెల 18న ఖమ్మంలో ప్రారంభం కానున్నది. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కంటి వెలుగు సన్నద్ధత,శిబిరాల ఏర్పాట్లపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే అన్ని జిల్లాల్లో ఏకకాలంలో కంటి పరీక్షలు మొదలుపెట్టాలని, ప్రణాళిక ప్రకారం సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కంటి పరీక్షలు నిర్వహించే మెషిన్లు, కంటి అద్దాలు, చుక్కల మందులు, ట్యాబ్లెట్లు శుక్రవారం సాయంత్రం నాటికి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరాలని సూచించారు.
ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులు ఎక్కడెక్కడ పాల్గొంటారో ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతికి రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేలా గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని, సమగ్ర వివరాలతో ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొత్తం కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని, జిల్లాస్థాయి అధికారులతో కూడిన వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని సమన్వయంతో విజయవంతం చేయాలని అన్నారు. కంటి పరీక్ష బృందాలు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఆ గ్రూప్‌లో అప్డేట్ చేయాలని పేర్కొన్నారు.
రెండో విడత.. 100 రోజులు
మొదటి విడత కంటి వెలుగు 8 నెలలపాటు జరుగగా, రెండో విడతను 100 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. 1,500 బృందాలను ఏర్పాటు చేశామని, జిల్లాలకు చేరే బృందాలతో కలెక్టర్లు సమావేశమై మార్గనిర్దేశనం చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 16,533 ప్రాంతాల్లో (రూరల్-12,763, అర్బన్ -3,788) క్యాంపులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని అన్నారు. అవసరమైన వారికి ఉచితంగా కండ్లద్దాలు పంపిణీ చేస్తామని, ప్రాథమికంగా 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్రిప్షన్ గ్లాసెస్ అవసరమవుతాయని అంచనా వేసినట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి, ప్రజా ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డీపీహెచ్) శ్రీనివాసరావు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
పరీక్షలకు ఆధార్ తప్పనిసరి
కంటి పరీక్షలు చేయించుకొనేవారు కచ్చితంగా ఆధార్ గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని మంత్రి పేర్కొన్నారు. ఆధార్ తప్పనిసరి అని తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని, లేకుంటే ఆధార్ కోసం మళ్లీ వెనక్కి వెళ్లాల్సి వస్తుందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసి అంధత్వ రహిత తెలంగాణను సాకారం చేయాలని పిలుపునిచ్చారు.