సారంగాపూర్/ఎల్లారెడ్డి, మార్చి 7 : యూరియా కోసం రైతులు నిజామాబాద్ రూరల్ మండలం గుండారం సొసైటీ వద్ద ఆందోళనకు దిగారు. శనివారం సొసైటీకి లోడ్ యూరియా రాగా, ఏడు గ్రామాలకు చెందిన రైతులు తరలివచ్చారు. యాప్లో బుక్ కాని రైతులు యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూసినా దొరక్కపోవడంతో సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన చేపట్టారు. యాప్ విధానం రద్దు చేసి పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీ సిబ్బంది తమకు అనుకూలంగా ఉన్న రైతులకు ముందస్తు సమాచారమిచ్చి యాప్లో బుక్ చేసుకునేలా చూస్తున్నారని ఆరోపించారు. యూరియా ఎవరికీ ఇవ్వొద్దంటూ కార్యాలయం ఎదుట భీష్మించుకొని కూర్చున్నారు.
అదే సమయంలో బుక్ చేసుకున్న రైతులు అక్కడికి చేరుకుని తమకు యూరియా ఇవ్వాలంటూ సిబ్బందిని కోరారు. మరోపక్క మరో రెండు లోడ్ల యూరియా తెప్పించాకే యూరియా అందరికీ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా పలువురు జోక్యం చేసుకొని సముదాయించారు. సొసైటీ సీఈవో వచ్చేంత వరకు తాము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని యూరియా బుక్ కాని రైతులు స్పష్టం చేస్తూ కార్యాలయం వద్ద గంటలపాటు బైఠాయించారు. కార్యక్రమంలో గుండారం సొసైటీ మాజీ చైర్మన్ దశరథం, ఖానాపూర్, గుండారం, జలాల్పూర్, సారంగాపూర్, కాలూర్, లక్ష్మాపూర్ రైతులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని గండిమాసానిపేట్లో యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. గండి మాసానిపేట సొసైటీకి యూరియా వస్తుందని అధికారులు చెప్పడంతో యాప్లో బుక్ చేసుకున్న రైతులు శనివారం ఉదయం 8 గంటలకే కార్యాలయానికి చేరుకున్నారు. యూరియా కోసం వరుసలో నిలబడలేక చెప్పులను క్యూలో ఉంచారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు.