కామారెడ్డి, మార్చి 7 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకున్నది. పట్టణంలోని ఆర్బీనగర్కు చెందిన ముగ్గురు చిన్నారులు శనివారం అదృశ్యమవగా, ఇందులో ఇద్దరి మృతదేహాలు పట్టణంలోని పెద్ద చెరువులో సాయంత్రం లభ్యమయ్యాయి. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉదయం తండ్రితో వెళ్లిన ఈ ముగ్గురు చిన్నారులను తండ్రే హత్యచేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ కోణంలో దర్యాప్తు చేపట్టారు. సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్బీనగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు సీపాత్ (8), అయాత్ (7), మరియం (5) శనివారం ఉదయం ఇంటి నుంచి ఆటో డ్రైవర్ అయిన తన తండ్రి ఇస్మాయిల్‌తో కలిసి ఆటోలో బయటికి వెళ్లారు.
మార్గమధ్యంలో గిరాకీ రావడంతో పిల్లలను ఓ షాపు వద్ద వదిలేసి ఇంటికి వెళ్లాలని చెప్పి వెళ్లాడు. సాయంత్రమైనా పిల్లలు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెంది కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి రూరల్, పట్టణ సీఐలు రామన్, నరహరి దర్యాప్తు చేపట్టారు. తండ్రి ఇస్మాయిల్ తన ఆటోలో పిల్లలను కామారెడ్డి పెద్ద చెరువు వైపు తీసుకెళ్తున్నట్టు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. వెంటనే చెరువు వద్దకు వెళ్లగా ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తించి స్థానికుల సాయంతో బయటికి తీశారు. మరొకరికోసం గాలిస్తున్నారు. ఇస్మాయిల్ పరారీలో ఉండటంతో కన్న తండ్రే హత్యచేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గోసంగి కాలనీలో మరో ఇద్దరు అదృశ్యం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి (10), కోదండం విజయ్ (9) శుక్రవారం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వారి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన చిన్నారుల సమాచారం తెలిస్తే, వారి తల్లిదండ్రులకు లేదా 87126 86145 ఫోన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు.