నా చిన్నప్పట్నుంచీ శక్తిమంతమైన మహిళల్నెందర్నో చూసాను. వాళ్లందరూ నా మీద ఎంతో ప్రభావం చూపారు. మంచి మగవాళ్లు తమచుట్టూ ఉండే స్త్రీలకు ఏ లోటూ ఉండదు. వారు నిశ్శబ్దంగా, నిశ్చింతగా జీవితంలో ఇమిడిపోతారు. పెద్దగా అరవాల్సిన, ఘర్షణ పడాల్సిన అవసరం లేకుండానే జీవితం గడిచిపోతుంది. వాళ్లకు ఉత్తమ ఇల్లాళ్లుగా పేరు కూడా వస్తుంది.
ఇక మూర్ఖులైన భర్తల్ని, తాగుబోతులైన మొగుళ్లని, అసమర్థులైన జీవిత భాగస్వాముల్ని, అహంభావులైన తండ్రుల్ని, నిర్దయులైన సంతానాన్ని రోజూ భరిస్తూ జీవితాన్ని గడపాల్సిన స్త్రీలు ఎంతో పోరాటం చేయాల్సి వస్తుంది. దుఃఖంతో, వేదనతో అడుగడుగునా సంఘర్షణతో వారి జీవితం నిండిపోతుంది. అలాంటి వారి నుంచి కొందరు ధీర వనితలు, పోరాట యోధులు ఉద్భవిస్తారు. తమచుట్టూ ఉన్న పరిస్థితులతో రాజీపడకుండా పోరాటం చేస్తూనే.. తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరచుకుంటారు. నిరాశతో కుంగిపోకుండా, నిస్పృహలో కూరుకుపోకుండా ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుంటారు. ఎవరిమీదా ఆధారపడకుండా తమ జీవికను ఏర్పరచుకోవడమే కాకుండా, ఇంటి బాధ్యతల్ని నెత్తికెత్తుకుంటారు. కుటుంబాన్ని పోషిస్తారు. సంతానాన్ని పెంచి పెద్దజేస్తారు. ఇలాంటి వాళ్లు మనచుట్టూ ఉంటారు గానీ, వారిని మనం గమనించాలి. వారి నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఉంటుంది.
మరికొంత మంది స్త్రీలు ఉంటారు. వారు సౌకర్యవంతమైన జీవితం గడిపినా, గడపకపోయినా ఇతరుల కష్టాలకు కదిలిపోతారు. వారి బాధలను అర్థం చేసుకుంటారు. వీలైతే బాధితుల కన్నీళ్లు తుడుస్తారు. అందుకోసం అవసరమైతే ఎంతటి పోరాటమైనా చేస్తారు.
పదిమందినీ కూడగట్టి మార్గదర్శకత్వం చేస్తారు.
అలాంటివాళ్లే నాయకులవుతారు. చరిత్రలో నిలిచిపోతారు. మహిళా దినోత్సవం నిజానికి ఇలాంటి వారి శ్రమ నుంచి, కృషి నుంచి పుట్టింది. పురుషులతో సమానంగా పని చేస్తున్నా కూడా మహిళలకు సమాన వేతనాలు లేవు. సమానమైన పనికి సమానమైన వేతనాలు కావాలనీ, పనిచేసే చోట కనీస సౌకర్యాలు ఉండాలనీ కొందరు స్త్రీలు మొదలు పెట్టిన పోరాటం.. క్రమంగా ప్రపంచ దేశాలన్నింటా పాకి ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఆ ఉద్యమమే మహిళా దినోత్సవానికి నాంది పలికింది.
భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్‌లో టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ అనే పేరుతో అనసూయా సారాభాయ్ నేతృత్వంలో కార్మికసంఘం ప్రారంభించారు. వస్త్ర పరిశ్రమల్లోని మహిళా శ్రామికులందరూ, పై అధికారుల హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా విధులు బహిష్కరించి వీధుల్లో పడ్డారు. ఆ పోరాటాల ఫలితంగానే స్వాతంత్య్రం తరువాత కార్మికుల బతుకులు మెరుగయ్యాయి. అస్సాం తేయాకు తోటల్లోనూ, నీలిమందు తయారీ పరిశ్రమలోనూ, అహ్మదాబాద్, బొంబాయి వస్త్ర పరిశ్రమల్లోనూ మహిళా కార్మికులు చేసిన పోరాటాల వల్ల కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు, మహిళా కార్మికుల గురించి చట్టాలు ఏర్పడ్డాయి. అలా ఏ విధంగా చూసినా శ్రామిక మహిళల హక్కుల పోరాటాల వల్ల అంతర్జాతీయంగా మహిళల సమస్యలు, ముఖ్యంగా పనిచేసే ఉత్పత్తి వర్గాల స్త్రీల సమస్యలు ప్రపంచానికి తెలిశాయి. ఈ పోరాటంలో కలిగిన కుటుంబాల స్త్రీల భాగస్వామ్యం దాదాపుగా లేదనే చెప్పాలి. అయితే, ఇళ్లల్లో గృహిణుల రెక్కల కష్టం, నిరంతర చాకిరీ, వారు ఎదుర్కొంటున్న హింస గురించి మాత్రం అధ్యయనాలు గానీ, ఉద్యమాలు గానీ ఇప్పటిదాకా
సమగ్రంగా జరగలేదు.
ఇటీవల కొన్నిచోట్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుపుకొంటున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
గతకాలపు స్త్రీలు ఎన్నో కష్టనష్టాలకోర్చి తమ తోటివారి మెరుగైన జీవితాల కోసం చేసిన కృషిని ఆదర్శంగా తీసుకుని.. ఆ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన దానికి బదులుగా మహిళా దినోత్సవం రోజున అందాల పోటీలు, క్యాట్ వాక్‌లు, చిట్టిపొట్టి ఆటలు, డ్యాన్సులు చేసి బహుమతులు ఇచ్చి పుచ్చుకుని విందు వినోదాలు జరుపుకొంటున్నారు. అవి కూడదని కాదు గానీ, ఆ సందర్భాన్ని ఇలా జరపడం ఔచిత్యంగా లేదు.
ఆ మధ్య ఒక ఊరిలో మార్చి 8న జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. సర్పంచ్ ఓ మహిళ. ఆమెతోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇతర ప్రముఖుల్నే కాకుండా.. సర్పంచ్ భర్తను కూడా స్టేజీ మీదకు పిలిచారు. మిగతా వాళ్లు వాళ్లకు తోచింది మాట్లాడాక.. నేను మాట్లాడే ముందు సర్పంచ్ మాట్లాడాల్సి ఉంది.
ఆమె పక్క సీట్లోనే ఉన్న భర్త.. “ఎహె! గామెకేం మాట్లాడొస్తది? నా పేరు పిలువుండి, మాట్లాడుత!” అని ఒకటే సతాయింపు మొదలుపెట్టాడు. ఆ సర్పంచమ్మ గూడా చిరునవ్వుతో.. ‘ఎంత సక్కని వాడో.. నా వాడు’ అన్నట్టు ఆయన వైపు మురిపెంగా చూస్తోంది పాపం! చివరికి సర్పంచు మైకు దగ్గరికి వెళ్లి కేవలం శుభాకాంక్షలు మాత్రం చెప్పి వచ్చేట్టూ, స్పీచు మటుకు ఆమె పతిదేవుడు ఇచ్చేట్టూ ఒప్పందం కుదిరింది. “నేను ఈమెను ఎక్వ కష్టపెట్ట మేడమ్! మంచిగ జూసుకుంట గిట్లనే!” అన్నాడాయన.. ఆమె మీదుగా తలవంచిమరీ నాతో.
ఆయన ఏం మాట్లాడుతాడో వినాలనే ఉత్సాహం నాలో కట్టలు తెంచుకుంది. “గీ మైలా దినమంటె మైలల దినం. మైలలను మంచిగ జూసుకోవాల్నన్నట్టు! ఎందుకంటె మైలల కోసం! ఆడోల్లు ఎప్పుడైన గూడ ఆడోల్లే ! మన తల్లి, మన శెల్లే, మన భార్య అందరు సుత ఆడోల్లే! మనకు వంట జేస్తరు, బట్లు ఉతుకుతరు, ఇంట్లే పని జేస్తరు, పిల్లల గంటరు. గందుకే మనం సత్తెనారాన్ వ్రతం జేసినా, ఇండ్లల్లకు ఒచ్చినా, పెండ్లీల కాడ, బోనాల కాడ, పెద్దమ్మ జాతర కాడ.. యాడ్నైనా ఆడోల్లను పక్కపంటి పెట్కోనే పూజల్ జేసుకుంటం. గంత గౌరవిస్తం అన్నట్టు. నేను సుత సర్పంచు సీటు లేడీసుకు అనంగనే మా భార్యను నించోవెట్టిన. (ఆమెవైపు ఒక్క లుక్కు ఇచ్చాడు ‘చూసావా?!’ అన్నట్టు. ఆమెకూడా తదనుగుణంగా సిగ్గు పడింది)..” ఇలా సాగింది ఆయన ప్రసంగం. ఆ తరువాత నేనేం మాట్లాడాలనుకున్నానో మర్చిపోయి వెతుక్కోవాల్సి వచ్చింది. అలాంటి ఎన్నో సమావేశాలు చూసాక అనిపించింది.. ‘మహిళా దినోత్సవం’ ఒక్క రోజే కాకుండా ఏడాదంతా కావాలని.
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి