Sara Khan | బక్రీద్ సందర్భంగా హిందీ టెలివిజన్ నటి సారా ఖాన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఈద్ అల్ అద్హా పండుగను కేవలం జంతు బలులతో పరిమితం చేయకుండా.. మానవత్వం, దయ, సేవా కార్యక్రమాల అసలైన సందేశాన్ని గుర్తుంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. సారా ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. బక్రీద్ సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన సారా ఖాన్.. ఆధ్యాత్మికత, కరుణ, దైవభక్తి గురించి మాట్లాడారు. “అల్లాకు మాంసం, రక్తం అవసరం లేదు. ఆయన మనలోని తఖ్వా (దైవ భీతి), కరుణ, విధేయతను మాత్రమే చూస్తారు” అని ఆమె పేర్కొన్నారు.
జంతువులను బలి ఇవ్వడం కంటే ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం, పేదలకు సహాయం చేయడం, నిస్సహాయులను ఆదుకోవడం గొప్పదని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే మనలోని అహంకారాన్ని త్యజించి మంచి మనసుతో జీవించడమే నిజమైన ఖుర్బానీ అని తెలిపారు. సారా ఖాన్ తన పోస్టులో బక్రీద్ పండుగను కేవలం వేడుకలు, ఆహారం, సంప్రదాయ ఆచారాలకు మాత్రమే పరిమితం చేయకూడదని అన్నారు. అల్లాపై సంపూర్ణ విశ్వాసం చూపించే రోజు ఇది. మనసులోని చెడు భావాలను త్యజించి పవిత్రతను పొందడమే అసలైన పండుగ భావం అని ఆమె పేర్కొన్నారు. సామాజిక సేవ, దానం, మానవత్వం వంటి విలువలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచించారు.
సారా ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె మాటల్లో మానవత్వం, దయ కనిపిస్తున్నాయని ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం సంప్రదాయ బక్రీద్ ఆచారాలపై వ్యాఖ్యానించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకంగా జంతు బలులపై ఆమె చేసిన వ్యాఖ్యలు కొంతమందిలో అసహనానికి కారణమయ్యాయి. అయితే మరికొందరు మాత్రం పండుగ అసలు ఉద్దేశాన్ని గుర్తు చేసినందుకు ఆమెను అభినందిస్తున్నారు. కాగా, హిందీ టెలివిజన్ ప్రపంచంలో సారా ఖాన్కు మంచి గుర్తింపు ఉంది. ‘సప్నా బాబుల్ కా… బిదాయి’ సీరియల్తో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. అలాగే రియాలిటీ షో ‘బిగ్ బాస్ 4’లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడు క్రిష్ పాఠక్తో ఆమె వివాహం కూడా అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్గా ఆ వివాహం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.