ఇప్పటివరకు రెండో దశలో మెట్రో కారిడార్లను ప్రతిపాదించినప్పుడు రెండు మార్గాల్లో మెట్రో కారిడార్‌ను ఎయిర్‌పోర్టు టర్మినల్ వరకు వెళ్లేలా ప్రతిపాదించారు. ఇందులో ఒకటి నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్పల్లి పీ7 రోడ్డు మీదుగా విమానాశ్రయం లోపలికి, అదేవిధంగా ఆరాంఘర్, కొత్తహైకోర్టు, శంషాబాద్ మీదుగా ఎయిర్‌పోర్టు లోపలికి ప్రతిపాదించారు. ఇదిలా ఉండగానే మళ్లీ మార్పులు చేసి నాగోల్ నుంచి ఇన్నర్ రింగు రోడ్డు మీదుగా ఆరాంఘర్, శంషాబాద్ మీదుగా ఎయిర్‌పోర్టు లోపలికి మెట్రో మార్గాన్ని తాజాగా ప్రతిపాదించామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.
Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రెండోదశ మెట్రోలో ప్రతిపాదిత కారిడార్లు అష్టవంకర్లు తిరుగుతున్నాయి. రోజుకో మాట, పూటకో పాట అన్నట్టుగా రెండో దశ మెట్రోను మార్పులు చేర్పులతో రేవంత్ సర్కారు కాలయాపన చేస్తున్నదే తప్ప… క్షేత్ర స్థాయిలో మెట్రోపనులు మాత్రం పట్టాలెక్కడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10నెలలు కావస్తున్నా..రెండోదశ మెట్రో కారిడార్లు ఇంకా ఫైనల్ కాలేదు. మొదటి దశ మెట్రో రైలు విజయవంతంగా నడుస్తుండగా, దానికి అనుబంధంగా నగరంలో పలుమార్గాల్లో మెట్రోను అందుబాటులోకి తీసుకురావాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. తాజాగా ఆదివారం మెట్రో రెండోదశ కారిడార్ల వివరాలను హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.
మొన్నటివరకు 70 కి.మీ. మేర రెండోదశ మెట్రో ఉంటుందని చెప్పిన అధికారులు, దాన్ని 116 కి.మీ మేర పెంచినట్టు ప్రకటించారు. దాంతోపాటే రెండో దశ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.32,237 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. అంతకు ముందు రెండో దశ మెట్రోకు రూ.20వేల కోట్లు అంచనా వేసిన అధికారులు, కొత్తగా ఫోర్త్ సిటీ మెట్రో కారిడార్‌తో కలిపి తాజా అంచనాలను రూ.32వేల కోట్లకు పెంచారు. ఇలా కాగితాల్లోనే మెట్రో రెండో దశ కారిడార్లు, వాటి అంచనాలు తారుమారవుతున్నాయే తప్ప క్షేత్ర స్థాయిలో పనులు నిర్వహించేందుకు అవసరమైన డీపీఆర్‌లు మాత్రం సిద్ధం కావడంలేదు. రెండోదశ డీపీఆర్‌ను జూన్ నాటికే తీసుకువస్తామని చెప్పిన రేవంత్ సర్కారు సెప్టెంబర్ గడుస్తున్నా ఇంకా సిద్ధం చేయించలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌సిటీకి 40 కి.మీతో మెట్రో కారిడార్
ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో కోర్ సిటీలోనే మెట్రో మార్గాలను పొడిగించాల్సిన అవసరం చాలా ఉంది. అయినా వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ప్రతిపాదిస్తున్న ఫోర్త్ సిటీకి మెట్రో కారిడార్‌ను నిర్మించాలని ప్రతిపాదించడంతో రెండో దశ డీపీఆర్‌ను రూపొందించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. సుమారు 40 కి.మీ దూరంతో ఎయిర్‌పోర్టు నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా కొంగర కలాన్ ఇంటర్చేంజ్ వరకు అక్కడి నుంచి ఫోర్త్ సిటీలో శంకుస్థాపన చేసిన స్కిల్ యూనివర్సిటీ వరకు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ రెండో దశ మెట్రో నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపడుతామని మెట్రో అధికారులు వెల్లడించారు.