హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని, జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుకూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే వరకు మూడు, నాలుగవ విడతలుగా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.
రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ఇన్చార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు డిపార్ట్మెంట్ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొదటి విడతలో మూడు లక్షలకుపైగా ఇండ్లను మంజూరు చేయగా, దాదాపు 2.9 లక్షల వరకు గ్రౌండింగ్ అయ్యాయని, ఇందులో ఇప్పటికే సుమారు 50 వేల గృహప్రవేశాలు జరిగాయని వివరించారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అటవీ భూములు ఉన్నాయని, రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాల మధ్య చాలా సరిహద్దు వివాదాలు ఉన్నాయని, రెండు విభాగాలు జాయింట్ సర్వే నిర్వహించి శాశ్వత పరిషారం చూపాలని సూచించారు. సమావేశంలో ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు సీతక, కొండాసురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, పీ బలరాంనాయక్, హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.