హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం రెండో విడత అమలుపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రెండో విడతలో 1.30లక్షల లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. ఇందుకోసం 2023-24 బడ్జెట్లో ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించడంతోపాటు ఇటీవల మార్గదర్శకాలను జారీచేయడంతో అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. దళితబంధు కింద తొలి విడతలో ప్రభుత్వం 38,323 మందికి రూ.10 లక్షల చొప్పున అందజేస్తున్నది.
రెండో విడతలో హుజురాబాద్ మినహా మిగిలిన 118 నియోజకవర్గాల్లో 1,100 కుటుంబాలకు మొత్తం 1,29,800 మందికి దళితబంధును అమలు చేయాలని నిర్ణయించింది. సీఎస్ కోటాలో మరో 200 దళితులకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నది. తొలి విడత లబ్ధిదారుల వివరాలతోపాటు వారు ఎంచుకున్న యూనిట్లు, వాటి పురోగతి తదితర వివరాలన్నింటినీ గ్రామాలవారీగా ఆన్లైన్లో పొందుపర్చారు. రెండో విడత దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై దృష్టిసారించిన అధికారులు.. త్వరలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.