హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు (SLBC) టన్నెల్లో భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. టన్నెల్ పనుల్లో 14 కిలోమీటర్ వద్ద పైకప్పు కూలడంతో ప్రమాదం చోటుచేసుకున్నది. దీంతో సొరంగమార్గంలో 11 కిలోమీటర్ల నుంచి 3 అడుగుల మేర నీరు, బురద నిలిచిఉంది. ఈ నేపథ్యంలో 11వ కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో వెళ్లిన సహాయక సిబ్బంది నుంచి 14 కి.మీ. వరకు నడుచుకుంటూ వెళ్లారు.
అయితే ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం దెబ్బతిన్నది. మిషన్‌కు రెండువైపులా పూర్తిగా మట్టి, బురద నిండిపోయింది. దీంతో అతికష్టంమీద బోరింగ్ మిషన్ ముందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. కాగా, నీరు, మట్టి, బురద తోడేవరకు అందులో చిక్కుకున్న వారిని అందులోనుంచి బయటకు తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్ల వెనకకు వచ్చిందని ఏజెన్సీ వెల్లడించింది.
శనివారం ఉదయం 8.30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఎస్సెల్బీసీ టన్నెల్ పనుల్లో 14 కిలోమీటర్ వద్ద ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదం నుంచి 42 మంది కార్మికులు, ఇంజినీర్లు తప్పించుకోగా, ఎనిమిది మంది లోపల చిక్కుకున్నారు. వారిని బయటకు రప్పించేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇటీవల సుదీర్ఘ విరామం తర్వాత పనులను పునః ప్రారంభించింది. శనివారం ఉదయం మొదటి షిఫ్ట్‌లో సుమారు 50 మంది కార్మికులు సొరంగంలో పనులు చేసేందుకు లోపలికి వెళ్లారు. 8:30 గంటల ప్రాంతంలో కార్మికులు పనులు చేస్తుండగా, అకస్మాత్తుగా పైకప్పు కూలిపడింది. మట్టిపెల్లలు విరిగిపడ్డాయి. దాదాపు మూడు కిలోమీటర్ల మేర పైనుంచి కాంక్రీట్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో భూకంపం వచ్చినట్టుగా భారీ శబ్దం వచ్చింది.
ఈ తీవ్రతతో దాదాపు వెయ్యి క్యూబిక్ మీటర్ల రాళ్లు, మట్టి సంఘటనా స్థలంలో పేరుకుపోయాయి. దీంతోపాటు భారీగా కూలిపడిన పెచ్చులు, మట్టిపెల్లలు, కాంక్రీట్తోపాటు టన్నెల్లో నీరు చేరిపోవడంతో టన్నెల్ బ్లాక్ అయిందని అధికారులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సొరంగంలో పనుల్లో ఉన్న కార్మికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాదాపు 42 మంది కార్మికులు, ఇంజినీర్లు మిషనరీని వదిలేసి ప్రాణాలు అరచేత బట్టుకుని బయటకు పరుగులు తీశారు. వీరిలో కొందరు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం జెన్కో దవాఖానకు తరలించారు. వీరంతా సురక్షితంగా ఉన్నారు. మరో ఎనిమిది మంది జేపీ కంపెనీ ఉద్యోగులు, కార్మికులు టన్నెల్‌లోనే ఉండిపోయారు. వారిని బయటకు రప్పించేందుకు కంపెనీ ఉద్యోగులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారు చిక్కుకున్న ప్రాంతంలో మట్టిపెల్లలు, కాంక్రీట్ పెల్ల్లలు, నీళ్లు చేరడంతో అక్కడికి వెళ్లడానికి ఇబ్బందికరంగా మారింది. చిక్కుకున్న వారు సురక్షితంగా ఉండేందుకు బయటి నుంచి ఆక్సిజన్ సరఫరాను కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోగా తర్వాత సరఫరాను పునరుద్ధరించారు.