Balakrishna Fans vs CV Anand | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘ఐబొమ్మ’ పైరసీ వ్యవహారం సినిమా నిర్మాతలకు నష్టం చేయడమే కాకుండా పోలీసు అధికారులు, నటులు, అభిమానులకు మధ్య వివాదానికి కారణమైంది. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు, రాష్ట్ర హోం శాఖ సెక్రటరీ సీవీ ఆనంద్ మధ్య సోషల్‌మీడియా వేదికగా జరిగిన రచ్చ ప్రస్తుతం పోలీసువర్గాల్లో చర్చనీయాంశమైంది. సెప్టెంబర్ 29న అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.. సైబర్‌క్రైమ్ టీమ్‌తో కలిసి పైరసీ వ్యవహారంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సినీ నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు. ఈ మీటింగ్‌కు బాలకృష్ణను పిలవకపోవడంపై ఆయన అభిమానులు ఆనంద్‌కు మెసేజ్ చేశారు. ఎక్స్‌లో ఆనంద్ చేసిన పోస్టుకు ఓ నెటిజన్ వ్యంగ్యంగా స్పందిస్తూ.. ‘సెప్టెంబర్ 30న బాలకృష్ణను కూడా పిలవండి.. లేకుంటే ఆయన అసెంబ్లీలో అడుగుతారు?’ అని వ్యాఖ్యానించారు. దీనికి తన హ్యాండిల్‌పై ఒక స్మైల్ ఎమోజీతో ఆనంద్ రిైప్లె ఇచ్చారు. ఇదే బాలకృష్ణ అభిమానులకు కోపం తెప్పించింది. అగ్రనటుడు, మూడుసార్లు ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ పట్ల అలా కామెంట్ చేయడం సరికాదని, ఆయనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలీసు వర్గాల్లో చర్చ..!
50 రోజుల క్రితం సీవీ ఆనంద్ హోంశాఖ సెక్రటరీగా బదిలీ అయ్యే ముందు జరిగిన ప్రెస్‌మీట్ ఈ స్థాయిలో వివాదాస్పదంగా మారడం ప్రస్తుతం పోలీసువర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ‘అక్కడ జరిగిందేమిటి? అసలు బాలకృష్ణను కావాలనే పిలవలేదా? అంతా అయిపోయిన నెల తర్వాత మళ్లీ ఈ వ్యవహారాన్ని తెరమీదకు తీసుకొనిరావడం వెనక ఎవరున్నారు?’అంటూ పోలీసులు చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారం దారి తప్పుతున్నదని భావించిన సీవీ ఆనంద్ తన ఎక్స్ ఖాతాలో బాలకృష్ణకు క్షమాపణలు చెప్తూ సోమవారం పోస్ట్ చేశారు. ఇదంతా కావాలని జరగలేదని, తన హ్యాండిల్ మెయింటెన్ చేసే వ్యక్తి పెట్టిన పోస్టు వల్ల ఇలా జరిగిందని, రెండు నెలల క్రితం పోస్ట్ చేసిన ఎమోజీ విషయంలో ఆయన అభిమానులు, విమర్శకులు రెండు గ్రూపులుగా గొడవపడి తనను టార్గెట్ చేయడం గమనించానని, వివాదం ముదరడంతో పోస్టును డిలీట్ చేశానని, గత నెలలోనే హ్యాండ్లర్‌ను తొలగించానని పేర్కొన్నారు. తన పోస్ట్ బాలకృష్ణను బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని ఆనంద్ పేర్కొన్నారు. బాలయ్య అభిమానులు వర్సెస్ విమర్శకుల మధ్య గొడవలో సీవీ ఆనంద్‌ను లాగడంపై పోలీసులు ఒకవైపు చర్చిస్తుండగా, ఈ మొత్తం తతంగం నడుపుతున్నదెవరనే విషయంలో పోలీసు శాఖలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.