న్యూఢిల్లీ, నవంబర్ 18 : కొత్త ఉద్యోగ నియామకాల కోసం భారతీయ కంపెనీల నుంచి హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గిపోయినట్లు అమెరికా ప్రభుత్వ డాటాను ఉటంకిస్తూ బ్లూమ్బర్గ్ వెల్లడించింది. భారత్కు చెందిన కంపెనీల అమెరికన్ ఉద్యోగ నియామకాలు పెరగడం, టెక్నాలజీలో మార్పులు, అమెరికా వెలుపల ఉండి పనిచేసే అవకాశాలు తగ్గడం వంటివి కొత్త హెచ్-1బీ వీసాదారులకు డిమాండు తగ్గిపోవడానికి కారణాలుగా నిపుణులు తెలిపారు. గడచిన దశాబ్దకాలంతో పోలిస్తే భారత్కు చెందిన ఏడు దిగ్గజ కంపెనీల నుంచి హెచ్-1బీ వీసాదరఖాస్తులు 2025 ఆర్థిక సంవత్సరంలో 70 శాతం తగ్గింది.
కొత్త ఉద్యోగ నియామకాల కోసం అమెజాన్ నుంచి అత్యధికంగా 4,644 హెచ్-1బీ దరఖాస్తులు ఆమోదం పొందగా మెటా ప్లాట్ఫామ్స్(1,555), మైక్రోసాఫ్ట్(1,394), గూగుల్(1,050) తర్వాతి స్థానాలలో ఉన్నట్లు యూఎస్సీఐఎస్ డాటాను విశ్లేషించిన నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ(ఎన్ఈఏపీ) పేర్కొంది.
వరుసగా రెండవ సంవత్సరం 2024-25లో అమెరికాలో అత్యధిక సంఖ్యలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులలో భారత్ అగ్రస్థానంలో ఉంది. అమెరికాలో మొత్తం 3,63,019 భారతీయ విద్యార్థులు ఉండగా, చైనాకు చెందిన విద్యార్థులు 2,65,919 మంది ఉన్నారు. స్టూడెంట్ వీసాలపై ఆంక్షలు విధించినప్పటికీ అమెరికాలోని భారతీయ విద్యార్థుల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 10 శాతం పెరిగింది.ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్(ఓపీటీ)లో సైతం 47.3 శాతం పెరుగుదల ఉంది. 2023-24లో ఓపీటీ విద్యార్థుల సంఖ్య 97,556 ఉండగా 2024-25లో అది 1,43,740 మంది విద్యార్థులకు పెరిగింది.