న్యూఢిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజలపై మరో మోయలేని భారాన్ని మోపింది. వాహనాల ఫిట్నెస్ టెస్ట్ ఫీజులను ఏకంగా 10 రెట్లు పెంచుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ ఫీజుల పెంపు తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. కేంద్ర మోటారు వాహన చట్టంలో సవరణలు చేపట్టిన ప్రభుత్వం వాహనాల వయసు, క్యాటగిరీ ఆధారంగా ఫీజు స్వరూపంలో గణనీయమైన మార్పులు చేసింది.
ఇతర మార్పులతోపాటు హయ్యర్ ఫిట్నెస్ టెస్టు ఫీజు వయో పరిమితిని కూడా ప్రభుత్వం సవరించింది. ఇక నుంచి 10 సంవత్సరాలు పూర్తయిన వాహనాలకు కూడా హయ్యర్ ఫీజును చెల్లించాలి. వాహన ఫిట్నెస్ టెస్టు మొదటి క్యాటగిరీలో 10-15 సంవత్సరాల నాటి వాహనాలు ఉంటాయి. రెండవ క్యాటగిరీలో 15-20 సంవత్సరాల నాటి వాహనాలు, మూడవ క్యాటగిరీలో 20 ఏండ్లు పెబడిన వాహనాలు ఉంటాయి. క్యాటగిరీని బట్టి వాహన ఫిట్నెస్ ఫీజు పెరుగుతుంది.
టూ వీలర్లు, త్రీ వీలర్లు, మీడియం/హెవీ గూడ్సు/ప్యాసింజర్ వాహనాలతోసహా అన్ని రకాల వాహనాలకు వయసు ఆధారిత ఫీజు శ్లాబ్లు వర్తిస్తాయి. 20 సంవత్సరాలు పైబడిన హెవీ కమర్షియల్ వాహనాలకు రూ.25 వేలు ఫిట్నెస్ టెస్టు ఫీజుగా చెల్లించాలి.