ముంబై : బీజేపీ పాలిత మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో రైతుల మరణ మృదంగం వినిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 899 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలే పంటకు గిట్టుబాటు ధరలు లేకపోయినా ఎలాగోలా నెట్టుకొస్తున్న రైతులకు ఇటీవల కురిసిన అకాల వర్షాలు బాగా దెబ్బతీశాయి. వరదల బారిన పడిన ఆరు నెలల్లో పంటలు దెబ్బతినడంతో నష్టాన్ని తట్టుకోలేక 537 మంది మరణించినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
మరాఠ్వాడాలోని ఛత్రపతి శంభాజీనగర్ డివిజనల్ కమిషనర్ కార్యాలయం అందించిన వివరాల ప్రకారం ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో 112 మంది, జాల్నా జిల్లాలో 32, పర్భనీలో 45, హింగోలిలో 33, నాందేడ్‌లో 90, బీడ్‌లో 108, లాతూర్‌లో 47, దర్శివ్లో 70 మంది ఈ ఆరు నెలల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. మరాఠ్వాడా ప్రాంతంలోని జిల్లాల రైతులకు పరిహారం అందజేసేందుకు ప్రభుత్వం 32 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. అయితే జరిగిన నష్టానికి, పరిహారానికి ఏమాత్రం పొంతన లేదని రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ వరదలకు పంట నష్టంతో పాటు 12 మంది మరణించగా, 1300 ఇండ్లు దెబ్బతిన్నాయి.
అకాల వర్షాల కారణంగా ఒక అరటి రైతుకు రూ.25 లక్షల పంట నష్టం వాటిల్లితే ప్రభుత్వం ఆ రైతుకు ఇప్పుడు రూ.25 వేల పరిహారం మాత్రం అందజేసిందని మాజీ ఎంపీ రాజుశెట్టి చెప్పారు.