న్యూఢిల్లీ, నవంబర్ 18 : కేంద్రంలో వరుసగా మూడోసారి గద్దెనెక్కిన మోదీ సర్కారు.. 2029కల్లా భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడతామని చెప్తున్నది. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరచూ తన మూడో టర్మ్ ముగిసేనాటికి జర్మనీని అధిగమించి ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత భారతే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనిపిస్తామని అంటున్నారు. అయితే వాస్తవ పరిస్థితుల్ని చూస్తే అదంతా ఈజీ మాత్రం కాదు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇటీవలి గణాంకాలే ఇందుకు నిదర్శనం.
ఈ ఏడాది మే నెలలో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం తర్వాత దాని సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం భారత్ ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ’ అన్నారు. 4 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఉందని, ఇప్పుడు జపాన్ కంటే భారత్ ముందున్నదని, ఐఎంఎఫ్ డాటానే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అయితే 2025 (2025-26)కుగాను ఐఎంఎఫ్ ప్రకటించిన జీడీపీ అంచనాల్ని ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారని తేటతెల్లమవుతున్నది. ఏప్రిల్‌లో విడుదలైన ఆ డాటా ప్రకారం భారత జీడీపీని 4.197 ట్రిలియన్ డాలర్లుగా, జపాన్ జీడీపీని 4.196 ట్రిలియన్ డాలర్లుగా ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇవి అంచనాలు మాత్రమే. అయినప్పటికీ ఈ ఏడాది పూర్తికాకుండానే ఐఎంఎఫ్.. భారత్‌ను టాప్-4 ఎకానమీ అందంటూ సుబ్రహ్మణ్యం అధికారికంగా ప్రకటించేశారు. నిజానికి గత నెల అక్టోబర్‌లో 2025కుగాను ఐఎంఎఫ్ మళ్లీ ఇచ్చిన అంచనాల్లో భారత్ కంటే జపాన్ జీడీపీనే ముందుంచింది. ఎప్పటికప్పుడు మారే ఈ అంచనాల నేపథ్యంలో జపాన్ను భారత్ దాటేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయిప్పుడు. అంతేగాక ఇప్పటికింకా జపాన్నే దాటలేదు.. మోదీ హయాం ముగిసేటప్పటికి జర్మనీని కూడా వెనక్కినెట్టి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందా? అన్న సందేహాలూ వెల్లువెత్తుతున్నాయి.
ఐఎంఎఫ్ ఏప్రిల్ ఔట్‌లుక్‌లో 2024 (2024-25)లో భారత్ జీడీపీ 3.91 ట్రిలియన్ డాలర్లుగా, జపాన్ 4.02 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయని చెప్పింది. దీంతో త్వరలోనే జపాన్ను భారత్ దాటేస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. కానీ దేశ జీడీపీ వృద్ధిని ఆయా దేశాల కరెన్సీ విలువలూ ప్రభావితం చేస్తాయి. డాలర్‌తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్‌నాటికి భారతీయ కరెన్సీ రూపాయి విలువ దాదాపు 4 శాతం దిగజారింది. మరోవైపు జపాన్ కరెన్సీ యెన్ 5 శాతానికిపైగా పుంజుకున్నది. ఈ క్రమంలోనే అక్టోబర్ రివ్యూలో ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత్ జీడీపీ 4.125 ట్రిలియన్ డాలర్లుగా, ఈ ఏడాది (2025) జపాన్ జీడీపీ 4.280 ట్రిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా. వీటిని ప్రభావితం చేసే పరిణామాలు ఈ 2-5 నెలల్లో చోటుచేసుకోవడం కష్టమే. దాంతో ఈ ఏడాదికి జపాన్ ఎకానమీ నాల్గో స్థానంలో, భారత్ ఐదో స్థానంలోనే ఉంటుందని అంటున్నారంతా.

2026 (2026-27)లో భారత్ జీడీపీ 4.506 ట్రిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేస్తున్నది. వృద్ధిరేటు 9.22 శాతంగా నమోదు కావచ్చని చెప్తున్నది. ఇదే సమయంలో జపాన్ 4.29 శాతం వృద్ధితో 4.464 ట్రిలియన్ డాలర్లకు పరిమితం కావచ్చని పేర్కొంటున్నది. దీంతో వచ్చే ఏడాది భారత్ నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని అంటున్నది. అయితే కరెన్సీ మార్కెట్లు, విదేశీ పెట్టుబడుల రాక, టారిఫ్ టెన్షన్లు, ఇతర అంతర్జాతీయ పరిణామాలు ఈ అంచనాల్ని ప్రభావితం చేస్తే.. తర్వాతి ఔట్లుక్లు మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎక్స్పర్ట్స్ మాట. ఇక 2028-29లో భారత్ జీడీపీ 5.462 ట్రిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ఐఎంఎఫ్ ఇప్పుడు వేస్తున్న అంచనా. అప్పుడు జపాన్ 4.821 ట్రిలియన్ డాలర్లుగానే ఉండొచ్చంటున్నది. అయితే 2028కిగాను జర్మనీ జీడీపీని 5.674 ట్రిలియన్ డాలర్లుగా ఐఎంఎఫ్ పేర్కొంటున్నది. దీన్నిబట్టి మోదీ మూడో టర్మ్ ముగిసేనాటికీ ఇప్పుడున్నట్టుగానే అమెరికా, చైనా, జర్మనీలు మొదటి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగానే ఉంటాయన్నది తేటతెల్లం. పరిస్థితులు అనుకూలిస్తే జపాన్ను దాటేస్తుందే తప్ప.. జర్మనీని భారత్ దాటబోదని ప్రస్తుతం మోదీ సర్కారు ప్రతిపాదికగా తీసుకుని గొప్పలు చెప్పుకుంటున్న ఐఎంఎఫ్ గణాంకాలే చెప్తున్నాయి. దీంతో ‘మోదీ 3.0 టార్గెట్ మిస్’ అనే మాటే వినిపిస్తున్నది.