హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న 700 ప్రభుత్వ పాఠశాలలను బుధవారం ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తమ పాఠశాలల్లో కల్పించిన వసతులను చూసి విద్యార్థులు మురిసిపోయారు. కొత్త డ్యూయల్ డెస్క్ బల్లలు, సరికొత్త హంగులు చూసి అబ్బురపడ్డారు. సర్కారు బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ‘మన ఊరు-మన బడి’లో భాగంగా ప్రభుత్వం తొలి విడతగా 9,123 పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందులో 1,200 పాఠశాలలు సిద్ధం కాగా దాదాపు 700 పాఠశాలలను ప్రారంభించారు.
విద్యారంగంలో బహుముఖ వ్యూహం
రా్రష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుదలకు ప్రభుత్వం బహుముఖ వ్యూహం అనుసరిస్తున్నది. బడుల్లో వసతుల కల్పనకు ‘మన ఊరు-మన బడి’ చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభమైంది. తొలిమెట్టు కార్యక్రమం ద్వారా విద్యా ప్రమాణాల పెంపుదలకు కృషి చేస్తున్నది. పాఠశాలల్లో గ్రంథాలయాలను విరివిగా నెలకొల్పుతున్నది. పాఠశాలల్లోని బాలికలకు శానిటేషన్ కిట్లను త్వరలోనే అందజేయనున్నది. ఇలా భిన్నమైన కార్యక్రమాలతో సర్కారు బడులను బలోపేతం చేస్తున్నది.
విద్యావ్యవస్థ బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం
విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ ని ప్రవేశపెట్టారు. ప్రతి మండలానికి 4 చొప్పున మాడల్ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం. ఇందుకోసం రూ.7,200 కోట్లు మంజూరు చేసింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా సర్కారు బడుల్లో సౌకర్యాలను కల్పించేందుకు సీఎం దీన్ని అమలుచేస్తున్నారు. -ములుగు జిల్లా గోవిందరావుపేటలో మంత్రి సత్యవతి
కేసీఆర్ సంకల్ప బలంతోనే..
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం. ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో తొలి విడతగా 9,123 పాఠశాలలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. హైదరాబాద్ సోమాజిగూడలోని రాజ్‌భవన్ పాఠశాలలో రూ.16,5,885 వ్యయంతో టాయిలెట్లు, రూ.13,11,940 వ్యయంతో డ్యుయల్ డెస్క్‌లు, రూ.2,60,944తో గ్రీన్‌చాక్ బోర్డులు ఏర్పాటుచేశాం.
-సోమాజిగూడలోని రాజ్‌భవన్ పాఠశాలలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
పేద వర్గాలకు గొప్ప వరం
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం పేద వర్గాలకు గొప్ప వరం. ఇది బడిని గుడిగా మార్చే కార్యక్రమం. ఒకే రోజు రాష్ట్రంలోని 700 బడులను ప్రారంభించుకోవడం శుభపరిణామం. సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు పాఠశాలల రూపురేఖలను సమగ్రంగా మారుస్తున్నాం. ప్రాథమిక దశలో మంచి పునాది వేస్తే.. భవిష్యత్తులో మంచి విద్యార్థులు తయారవుతారు. రాష్ట్రంలో ఉత్తమ మానవ వనరులు తయారవుతాయి. ఈ పథకం బడి వాతావరణాన్ని మార్చి, బడికి వెళ్లాలన్న ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఒక్కో బడిపై కనిష్ఠంగా రూ.5 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.కోటికి పైగా నిధులు ఖర్చుపెట్టాం. ప్రజలు, యువత, మేధావులు బడుల నిర్వహణ బాధ్యత తీసుకోవాలి.
-తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి
తెలంగాణలోనే ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే కేజీ టు పీజీ ఉచిత విద్యనందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. సమైక్య పాలనలో సరైన వసతుల్లేక చిక్కి శిథిలమైన సర్కారు బడులకు సకల హంగులు కల్పించేందుకే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. సీఎం కేసీఆర్ విద్యారంగానికి బడ్జెట్లో పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తున్నారు. విద్య, వైద్యం కోసం ప్రతిక్షణం పరితపిస్తున్నారు. విద్యార్థులు సెల్ఫోన్లకు బానిసలు కావద్దు. కష్టపడి చదవి లక్ష్యాలను చేరుకోవాలి.
-కరీంనగర్ జిల్లా చింతకుంట పాఠశాలలో మంత్రి గంగుల కమలాకర్
దశలవారీగా డిజిటల్ విద్య
‘మన ఊరు-మన బడి’తో సర్కారు బడులకు మహర్దశ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో పాఠశాలలు తీవ్ర నిరాధరణకు గురయ్యాయి. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పిస్తున్నారు. దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది.
-మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ పాఠశాలలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ప్రభుత్వ విద్య బలోపేతమే ధ్యేయం
ప్రభుత్వ విద్య బలోపేతమే ప్రభుత్వ ధ్యేయం. కార్పొరేట్‌కు దీటుగా సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. పేదలకు నాణ్యమైన విద్యనందించాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ చేపట్టారు. ఖమ్మం జిల్లాలో మొదటి విడతగా 426 స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. రానున్న రోజుల్లో అన్ని పాఠశాలల్లోనూ పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తాం.
-ఖమ్మంలోని మామిళ్లగూడెం పాఠశాలలో మంత్రి పువ్వాడ
ప్రభుత్వ బడులకు మంచికాలం
‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉచిత విద్య, భోజనం ఉండగా పిల్లలను ప్రైవేటుకు పంపడం ఎందుకు?. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలపై మోజును విడనాడాలి.
– జనగామ జిల్లా మొండిచింత తండా పాఠశాలలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పు రాబోతున్నది. విద్యారంగం బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. సర్కారు సూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నిర్మల్ జిల్లాలో మొదటి విడతలో రూ.82 కోట్లతో 260 పాఠశాలలను ఆధునికీకరిస్తున్నాం.
-నిర్మల్ మండలం ఎల్లపెల్లిలోని పాఠశాలలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం
చరిత్రలో నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తయారవుతున్నాయి. విద్యార్థులకు ఉత్తమ విద్యను బోధిస్తున్నాయి.
-మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారంలో పాఠశాలలో మంత్రి సీహెచ్ మల్లారెడ్డి