హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బడుల వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. వాస్తవంగా ఈ నెల 11 వరకు వేసవి సెలవులు ప్రకటించగా, 12వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నది. 13న రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో రీ ఓపెనింగ్ తేదీని మార్చాలన్న విజ్ఞప్తులు వచ్చాయి. ఈ మేరకు 15వ తేదీకి బడుల రీఓపెన్ను వాయిదా వేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 12న సెలవు ప్రకటించగా, దీనికి బదులు జూలై 11న (రెండో శనివారం) వర్కింగ్ డేగా పరిగణిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.