Telangana | హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న రైతు అనుకూల విధానాలతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సువర్ణాధ్యాయం నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా వర్ధిల్లుతున్నది. స్వరాష్ట్రంలో రైతుల కడగండ్లు తీరాయి. ఒకనాటి బంజరు భూములు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. కాళేశ్వరం వంటి భారీప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతుబీమా, 24 గంటలు ఉచితవిద్యుత్తు వంటి పథకాలు వ్యవసాయ రంగం రూపురేఖలను మార్చేశాయి. స్వరాష్ట్రంలో సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తులు భారీగా పెరిగాయి. రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు వ్యవసాయరంగ అభివృద్ధి, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై వివరాలను ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది.
సాగు నీటి గోసకు పరిష్కారం
ఉమ్మడి పాలనలో జరిగిన వివక్ష, తెలంగాణ రైతుల ఇబ్బందులపై లోతైన అవగాహన ఉన్న సీఎం కేసీఆర్.. పాలనా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వ్యవసాయ రంగం పునరుజ్జీవం కోసం చర్యలు చేపట్టారు. వ్యవసాయరంగం రూపురేఖలు మార్చేందుకు సాగునీటి సమస్యను పరిష్కరించడమే ఏకైక మార్గమని గుర్తించి తెలంగాణకు కేటాయించిన గోదావరి, కృష్ణా జలాలను పూర్తిగా వినియోగించుకునేందుకు నడుంబిగించారు. అసంపూర్తిగా మిగిలిపోయిన ఎస్సారెస్సీ వరద కాలువ లాంటి ప్రాజెక్టులతోపాటు కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. తాజాగా పాలమూరు-రంగారెడ్డికి కూడా పర్యావరణ అనుమతులొచ్చాయి. గత తొమ్మిదేండ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.1.59 లక్షల కోట్లు ప్రభుత్వం వ్యయం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు కాలంలో నిర్మించింది. మిషన్ కాకతీయ కింద రూ.5,249 కోట్లతో కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించింది.
సకాలంలో ఎరువులు, విత్తనాలు
రైతులకు వ్యవసాయశాఖ సేవలను చేరువ చేసేందుకు ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించింది. సీజన్‌కు ముందే రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నది. దేశానికి అవసరమయ్యే పత్తి విత్తనాల్లో 50% తెలంగాణాలోనే ఉత్పత్తి అవుతున్నాయి. నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై పీడీ యాక్టు అమలు చేస్తున్నది. పంటలకు గిట్టుబాటు ధర కోసం ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. క్రాప్ బుకింగ్ అవలంభిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
పెరిగిన గోడౌన్ల సామర్థ్యం
రాష్ట్రంలోని గోడౌన్ల సామర్థ్యం 2014-15లో 39.01 లక్షల టన్నులు ఉంటే, ప్రస్తుతం 73.82 లక్షల టన్నులకు పెరిగింది. 196 వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ పదవులను రిజర్వేషన్ల ద్వారా భర్తీ చేసున్నది. సీజన్‌కు ముందే ఏ పంటలు వేయాలో రైతులకు సూచించడానికి మారెట్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్‌ను ఏర్పాటు చేసింది.
సూక్ష్మసేద్యానికి భారీగా సబ్సిడీలు
సూక్ష్మసేద్యం ద్వారా రూ.2,186.14 కోట్ల సబ్సిడీతో 3.10 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. రూ.291.66 కోట్ల సబ్సిడీతో 1,324 ఎకరాల్లో 1,190 రైతుల పాలీహౌజ్‌లను అభివృద్ధి చేసింది. పంట నష్ట పరిహారం కింద రూ.1490.15 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లించింది. ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంలో భాగంగా ఆయిల్‌పాం విస్తీర్ణం పెం పునకు కృషి చేస్తున్నది. 2022-23 లోనే 82,372 ఎకరాల్లో నూతనంగా ఆయిల్‌పాం సాగు చేశారు.
వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట
వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.963.26 కోట్లు వెచ్చించింది. దీంతో 6.66 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. 2014-15లో ట్రాక్టర్లు 94,537 ఉంటే, ప్రస్తుతం 3.52 లక్షలకు పెరిగాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత ట్రాక్టర్లపై రూ.273.5 కోట్ల రవాణా పన్నును మాఫీ చేయడమే కాకుండా రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న రూ.41.6 కోట్ల రవాణా పన్నును సైతం రద్దు చేసింది.
కొనుగోలు చేసిన ధాన్యం విలువరూ.1.33 లక్షల కోట్లు
వ్యవసాయరంగ బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితానిచ్చాయి. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి భారీగా పెరిగింది. 2014లో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా 2022-23 నాటికి 2.20 కోట్ల ఎకరాలకు పెరిగింది.
తెలంగాణ రైతు సంక్షేమంలో కొన్ని మైలురాళ్లు