హైదరాబాద్, సెప్టెంబర్27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అక్టోబర్ 31వ తేదీలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల ఫిరాయింపును నిర్ధారించే ప్రక్రియను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ వేగవంతం చేశారు. ట్రిబ్యునల్ 10వ షెడ్యూల్ కింద విచారణకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 29 నుంచి ప్రత్యక్ష విచారణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఫిరాయింపుదారులకు, వారి మీద ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పీకర్ వ్యక్తిగతంగా నోటీసుల పంపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నోటీసులు అందుకున్నవారిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఒక్కో ఎమ్మెల్యేను గంటపాటు విచారణ
వాస్తవానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలోనే నోటీసులు ఇవ్వగా, వారు లిఖిత పూర్వక సమాధానాలు కూడా ఇచ్చారు. అయితే వాటిపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఉపేందర్‌రెడ్డికి రిజాయిండర్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్రయల్‌కు రావాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నోటీసులు పంపారు. రోజుకు నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల చొప్పున ట్రయల్‌కు పిలిచినట్టు తెలిసింది. ఒక్కో ఎమ్మెల్యేను కనీసం గంటపాటు స్పీకర్ విచారించనున్నట్టు సమాచారం. సెపెంబర్ 29న ఉదయం 11 నుంచి 12 గంటలకువరకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, 12 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కాలె యాదయ్యను, ఒంటిగంట నుంచి 2 గంటల వరకు పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని, 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని విచారిస్తారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 1న మరోసారి ఇదే వరుసలో నలుగురు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నట్టు సమాచారం. అయితే, దానం నాగేందర్‌తో రాజీనామా చేయించకపోతే మిగతా 9 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నదని గాంధీ భవన్వర్గాల్లో చర్చ జరుగుతున్నది.