హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటాపై ‘కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్’లో విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ విచారణను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. నీటివాటాను తేల్చే బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగిస్తూ కేంద్రం గత నెల 6వ తేదీన గెజిట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఈ నెలలోట్రిబ్యునల్ విచారణ జరుపాల్సి ఉన్నది.
అయితే ఈ విచారణను వాయిదా వేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ తరఫున సీనియర్ కౌన్సిల్ సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ.. నదీ జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని విభజన చట్టంలోనే ఉన్నదని గుర్తుచేస్తూ, ట్రిబ్యునల్ విచారణను వాయిదా వేయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. వాదనలు కొనసాగించవచ్చని ట్రిబ్యునల్‌కు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.