ఎస్సీ వర్గీకరణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. దశాబ్దాల కల సాకారమైంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ సైతం సంపూర్ణ మద్దతు తెలిపి బాసటగా నిలిచింది. ఈ బిల్లు ప్రకారం.. ఎస్సీలను ఏ,బీ,సీ అనే మూడు గ్రూప్‌లుగా విభజించారు. ప్రస్తుతం ఎస్సీలకు అమలవుతున్న 15% రిజర్వేషన్లను ఏ గ్రూప్‌లోని 15 ఉప కులాలకు 1%, బీ గ్రూప్‌లోని 18 ఉపకులాలకు 9%, సీ గ్రూప్‌లోని 26 ఉప కులాలకు 5% చొప్పున రిజర్వేషన్ అమలవుతుంది. బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలపడంతో దళితవర్గాల్లోనే కాకుండా, రాజకీయవర్గాల్లోనూ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ):ఎస్సీలకు ప్రస్తుతం 15% రిజర్వేషన్ అమలవుతున్నది. అయితే, ఆ కోటాలో మాల కులస్తులే ఎకువగా లబ్ధి పొందుతున్నారనే చర్చ 1970వ దశకంలోనే మొదలైంది. అది క్రమేణా ఊపందుకున్నది. జనాభాపరంగా మాలల కన్నా మాదిగల సంఖ్య ఎకువ ఉన్నప్పటికీ, విద్య, ఉద్యోగావకాశాల్లో తక్కువ వాటా పొందుతుండటం వర్గీకరణ ఉద్యమానికి బీజం వేసింది. తమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలంటూ మాదిగలు పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై 1995లో అప్పటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్‌ను నియమించింది. మాదిగల వాదన నిజమేనని సమర్థిస్తూ ఆ కమిషన్ 1996లో నివేదికను సమర్పించింది. దాని ఆధారంగా ఉమ్మడి రాష్ట్రంలో 1997 జూన్‌లో ఆనాటి టీడీపీ (ఎన్డీఏ భాగస్వామి) ప్రభుత్వం 15% ఎస్సీ కోటాను ఏ,బీ,సీ,డీగా విభజిస్తూ జీవో విడుదల చేసింది.
2000 సంవత్సరంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం చేసింది. అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించగా, రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చింది. కానీ, 2004 నవంబర్‌లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్వర్గీకరణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని తేల్చిచెప్పింది. నాటి నుంచి ఈ అంశం పెండింగ్‌లోనే ఉన్నది. గత ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్‌ను వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ర్టాలకు ఉన్నదని తీర్పిచ్చింది. దీంతో వర్గీకరణను అమలుకు సిఫారసులు చేసేందుకు మంత్రి ఉత్తమ్ చైర్మన్‌గా క్యాబినెట్ సబ్‌కమిటీని, హైకోర్టు మాజీ న్యాయమూర్తి షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 2011 జనాభా లెక్కలను ఆధారంగా రిజర్వేషన్లను కమిషన్ వర్గీకరించింది.
రాష్ట్రంలో 52,17,684 మంది ఎస్సీ జనాభా ఉన్నట్టు నిర్ధారించింది. 59 షెడ్యూల్ కులాలను మూడు గ్రూప్‌లుగా విభజించింది. ఎస్సీలకు అమలుచేస్తున్న 15% రిజర్వేషన్లను ఏ గ్రూప్‌లోని 15 ఎస్సీకులాలకు 1%, బీ గ్రూప్‌లోని 18 ఎస్సీ కులాలకు 9%, సీ గ్రూప్‌లోని 26 కులాలకు 5% చొప్పున రిజర్వేషన్ అమలుచేయాలని సిఫారసు చేసింది. ఈ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. తాజాగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం.. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ బిల్లుకు బీఆర్ఎస్తోపాటు అన్ని పక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
మాదిగల పోరాటానికి బీఆర్ఎస్ బాసట
ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు మాదిగలతోపాటు ఇతర దళితవర్గాలు దశాబ్దాలుగా అలుపెరగకుండా పోరాడుతున్నాయి. ఎన్నికల సమయంలో సమస్యను పరిష్కరిస్తామని, చొరవ చూపుతామని జాతీయపార్టీలు హామీ ఇవ్వడం, అధికారంలోకి వ చ్చాక అటకెక్కించడం పరిపాటిగా మారిపోయింది. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయగా, దానికి ప్రతిస్పందనగా కేంద్రంలోని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఉషామెహ్రా కమిషన్‌ను ఏర్పాటుచేసింది. 2008 మేలో అప్పటి కేంద్ర మంత్రి మీరాకుమార్‌కు కమిషన్ నివేదికను సమర్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్-341ని సవరించాలని, ఆ ఆర్టికల్‌లో 3వ క్లాజును చేర్చడం ద్వారా, రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంట్ ఆమోదించవచ్చని కమిషన్ సిఫారసు చేసింది. కానీ, కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు.
2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇప్పటివరకూ పట్టించుకోలేదు. ఎస్సీ వర్గీకరణకు ఉద్యమకాలం నుంచే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాసటగా ఉన్నారు. పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచారు. రిజర్వేషన్ల వర్గీకరణ ప్రాధాన్యంపై గళం వినిపించారు. దళితవర్గాల ప్రతి పోరాటానికి మద్దతు పలికారు. ధర్నాల్లోనూ పాలుపంచుకున్నారు. 2014లో పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచి ఎస్సీ వర్గీకరణ అంశంపై మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనంతరం ఎస్సీ వర్గీకరణ కోసం 2014 నవంబర్ 29న అసెంబ్లీలో తీర్మానం చేశారు. శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేసీఆర్ 2016 మే 11న ప్రధాని మోదీని కలిసి ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. తరువాత కూడా ఎస్సీ వర్గీకరణకు ప్రతి దశలోనూ మద్దతు తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను 2017లో తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు సైతం బీఆర్ఎస్ మద్దతు తెలిపి బాసటగా నిలిచింది. దళితవర్గాల చిరకాల ఆకాంక్ష నెరవేర్చింది.
రెండు వర్గీకరణలు సేమ్: దామోదర
ఎస్సీ ఉపకులాల వర్గీకరణలో పాత వర్గీకరణకు, కొత్త వర్గీకరణకు పెద్దగా తేడాలు లేవని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో ప్రకటించారు. 33 కులాలు కొత్త, పాత వర్గీకరణలో యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించారు. ఎస్సీ కులాల వర్గీకరణ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఆయన ప్రసంగించారు. మొత్తం 59 ఎస్సీ కులాలను మూడు గ్రూప్‌లుగా విభజించామని తెలిపారు. గ్రూప్-1లో 15 కులాలు ఉండగా వీరి జనాభా 1,71,625 మాత్రమే ఉన్నదని, వీరికి 1% రిజర్వేషన్, గ్రూప్-2లో 18 కులాలుండగా, వీరి జనాభా 32,74,377 ఉన్నదని, వీరికి 9% రిజర్వేషన్, గ్రూప్-3లో 26 కులాలుండగా 5% రిజర్వేషన్‌ను కేటాయించామని వివరించారు. పాతవర్గీకరణలోని గ్రూప్-ఏలో ఉన్న నా లుగు, గ్రూప్-బీలోని 10, గ్రూప్-సీలోని 20 కు లాలు ఇప్పుడు 1,2,3 గ్రూపుల్లోనే కొనసాగుతాయ ని చెప్పారు. కొత్తగా చేరిన యాటాల, వల్లువాన్ కులాలతోపాటు మిగతా 26 కులాలుఇతర గ్రూపుల్లోకి మారాయని తెలిపారు. ఈ 26 కులాల జనాభా 1,78,914 (3.43%) మాత్రమేనని వివరించారు.
2 లేదా 4 గ్రూప్‌లుగా అసాధ్యం
ఎస్సీ కులాలను రెండు, లేదా నాలుగు గ్రూప్‌లుగా వర్గీకరించడం ఆచరణ సాధ్యంకాదని షమీమ్ అక్తర్ కమిషన్ అధ్యయనంలో తేలినట్టు దామోదర రాజనర్సింహ తెలిపారు. రెండు గ్రూప్‌లుగా విభజిస్తే అది అసమానతలకు దారితీస్తుందని, నాలుగు గ్రూప్‌లుగా వర్గీకరించే స్థాయిలో తేడాలు లేనందున మూడు గ్రూప్‌లుగా విభజించి రిజర్వేషన్లు అమలుచేయాలని కమిషన్ సూచించినట్టు పేర్కొన్నారు. ఎంపిరికల్ డాటా, కమిషన్ అధ్యయనం ప్రకారం నాలుగు గ్రూప్‌లుగా చేయలేమని తేల్చిచెప్పారు. మొత్తంగా ‘మా వాటా.. మాకు కావాలి’ అన్న ఆకాంక్ష ఈ బిల్లుతో నెరవేరబోతున్నదని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ ఏ కులానికి వ్యతిరేకం కాదని, సోషల్ జస్టిస్‌లో భాగమని స్పష్టంచేశారు. ఎస్సీ వర్గీకరణను సభ ఆమోదించాలని కోరారు.
జనాభా దామాషా ప్రకారం పెంచుతాం: ఉత్తమ్
రాబోయే రోజుల్లో ఎస్సీల జనాభా ఎంత పెరిగితే అంత మేరకు రిజర్వేషన్లను పెంచుతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ‘2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేయడంపై కొందరు అభ్యంతర వ్యక్తంచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎస్సీల జనాభా 17.5% పెరిగింది. ఆ మేరకు రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్లు ఉన్నాయి. 2026 జనగణన ప్రకారం పెరిగిన జనాభాను బట్టి రిజర్వేషన్లను పెంచేందుకు వీలు కల్పిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది’ అని సభలో ప్రకటించారు. క్రీమీలేయర్ అమలు చేయాలన్న షమీమ్ అక్తర్ కమిషన్ సిఫారసులను క్యాబినెట్ తిరస్కరించిందని తెలిపారు.
కేంద్ర కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతాం ;ఎస్సీ వర్గీకరణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు:సీఎం రేవంత్
ఎస్సీల వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంలో దళితులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ప్రస్తుతం ఇస్తున్న రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే కులగణన తర్వాత అవసరమైతే పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై జరిగిన చర్చ అనంతరం సీఎం మాట్లాడారు. ఎన్నో ఏండ్లుగా వర్గీకరణ కోసం పోరాడుతున్న దళితుల కల నేటితో సాకారమైందని చెప్పారు. ఇందుకు ఏకగ్రీవంగా సహకరించిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీలు, కులసంఘాల నాయకులకు సీఎం రేవంత్‌రెడ్డి సభ సాక్షిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఎస్సీ ఉపకులాలకు న్యాయం చేసే విషయంలో ప్రతిపక్షంతో సహా అన్ని పక్షాలను కలుపుకొని ముందుకెళ్తామని చెప్పారు. సీఎం ప్రసంగం అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ‘ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన వర్గీకరణ బిల్లును నా చేతుల మీదుగా ప్రవేశపెట్టి, ఏకగ్రీవంగా పాస్ చేయించుకోవడం, మా ఉపకులాలకు నా ఆధ్వర్యంలో సామాజిక న్యాయం జరగడం నా అదృష్టం’ అని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు దామోదర రాజనర్సింహను అభినందించారు.
ఎస్సీ వర్గీకరణ, దేవాదాయచట్ట సవరణ బిల్లుల ఆమోదం
ఎస్సీ వర్గీకరణ బిల్లుతోపాటు దేవాదాయ చట్ట సవరణ బిల్లులను మంగళవారం శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించారు. ముందుగా మంత్రి దామోదర రాజనర్సింహ షెడ్యూల్డ్ కులాల ఏకీకృత మరియు ఏకరీతి అభివృద్ధికిగానూ ఉప-వర్గీకరణ ద్వారా రిజర్వేషన్ల హేతుబద్ధీకరణకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టగా కాంగ్రెస్ సభ్యులు వివేక్ వెంకటస్వామి, వేముల వీరేశం, నాగరాజు, మందుల సామేల్, బీఆర్ఎస్ సభ్యులు ప్రశాంత్‌రెడ్డి, మాణిక్‌రావు, కాలె యాదయ్య, బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్, మజ్లిస్ సభ్యుడు మాజిద్ హుస్సేన్, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు, కడియం శ్రీహరి బిల్లును సమర్థించారు. అనంతరం దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకమండలి ఏర్పాటుపై తెలంగాణ ధార్మిక మరియు హిందూ మత సంస్థల, ధర్మాదాయల చట్టం-1987 సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, కాంగ్రెస్ సభ్యులు బీర్ల ఐల య్య, ఆది శ్రీనివాస్, శ్రీహరి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, ఎంఐఎం సభ్యుడు కౌసర్ మొయినుద్దీన్, బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు బిల్లును సమర్థించగా, రెండుబిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి.
వైటీడీ అంటే ఏంటి? : పాల్వాయి హరీశ్
దేవాదాయ చట్ట సవరణ బిల్లులో యాదగిరిగుట్ట దేవస్థానాన్ని వైటీడీగా పేర్కొనడంపై, అదేంటో చెప్పాలని బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్ వివరణ కోరారు. మంత్రి సమాధానం చెప్పలేకపోయారు. మంత్రి అధికారుల నుంచి సమాధానం కోరేందుకు ప్రయత్నించగా వారి నుంచి జవాబు రాలేదు. అనంతరం కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి జోక్యం చేసుకొని వైటీడీ కాకుండా వైజీడీ అంటే బాగుంటుందని సూచించారు.
ఎస్సీ-ఏ గ్రూప్‌లోని కులాలు
బావురి, బేడా (బడ్గ) జంగం, చదాటి, డక్కల్, డొక్కల్వార్, జగ్గలి, కొలుపులవాండ్లు, పంబాడ, పంబండ, పంబాల, మాంగ్, మాంగ్ గరోడి, మన్నే, మస్లీ, మాతంగి, మెహతర్, ముండాల, సంబన్, సప్రు
ఎస్సీ-బీ గ్రూప్‌లోని కులాలుఆరుంధతీయ, బైండ్ల, చమర్, మోచీ, ముచి, చమర్ రవిదాస్, చమర్ రోహిదాస్, చంబర్, చండాల, దండాసి, డోమ్, డోంబరా, పైడి, పానో, ఎల్లమ్మల్వార్, ఎల్లమ్మలవాండ్లు, గోడారి, జాంబువులు, మాదిగ, మాదిగ దాసు, మస్తీన్, పామిడి, పంచమ, పరియ, సమగర, సిందోళ్లు (చిందోల్లు), యాటల, వల్లువన్.
ఎస్సీ-సీ గ్రూప్‌లోని కులాలు
ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, ఆనాముక్, ఆరె మాల, ఆర్వ మాల, బారికి, బ్యాగరి, చలవాడి, డోర్, ఘాసి, హడ్డి, రెల్లి, దాచండి, గోసంగి, హోలేయా, హోలేయ దాసరి, మాదాసి కురువ, మాదరి కురువ, మహర్, మాల, మాల అయ్యవార్, మాల దాసరి, మాలదాసు, మాల హన్నయ్, మాల జంగం, మాల మస్తీ, మాల సాలె, నేతకాని, మాల సన్యాసి, మిత అయ్యల్వార్, పాకి, మోటీ, తోటి, రెల్లి.