హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): మహిళల విద్యాభివృద్ధికి బాటలు వేసిన తొలితరం ఉద్యమకారిణి సావిత్రీబాయి పూలే అని బీఆర్ఎస్ఎల్పీ ఉపనాయకుడు, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు కీర్తించారు. సమాజంలో మహిళలకు చదువు ప్రాముఖ్యతను చాటిచెప్పిన వీరనారి సావిత్రీబాయి అని పేర్కొన్నారు. మహిళల విద్యకు పునాది వేసి, అణగారినవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలని కొనియడారు. శనివారం సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణభవన్‌లో ఆమె చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. సమాజ చైతన్యం విద్య ద్వారానే సాధ్యమవుతుందని మహిళలకు విద్య ప్రాముఖ్యతను ఆనాడే చాటిచెప్పిన గొప్ప మహిళ సావిత్రీబాయి అని తెలిపారు. నేటితరం మహిళలు సావిత్రీబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలని డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ కోరారు.
సావిత్రీబాయి స్ఫూర్తితో మహిళలు విద్యకు పాముఖ్యతనిచ్చి, అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, విప్ కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాధవరం కృష్ణారావు, డాక్టర్ కే సంజయ్, కాలేరు వెంకటేశ్, మాణిక్‌రావు, విజయుడు, అనిల్‌జాదవ్, రాజ్యసభ మాజీ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు గజ్జెల నగేశ్, దేవీప్రసాద్, వెంకటేశ్వర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, నాయకులు సుమిత్రానంద్, మమత, విజయ, పాల్గొన్నారు.