హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. తెలంగాణలో మహిళలకు శ్రీరామ రక్ష తెలంగాణ తొలి సీఎం కేసీఆరేనని చెప్పారు. తెలంగాణ భవన్లో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో ఒకపక్క ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా.. అదే నియోజకవర్గంలో మరో పక్క మహిళలపై లైంగికదాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి మహిళల భద్రతకు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఘటనపై సీఎం కనీసం ఆరా కూడా తీయకపోవడం శోచనీయమని నిప్పులు చెరిగారు. దళిత మహిళపై జరిగిన అత్యాచారాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. పోలీసుల ఉదాసీనత వల్లే నేరాలు పెరుగుతున్నాయన్నారు.
మహిళలపై లైంగికదాడులు జరుగుతున్నప్పటికీ క్యాబినెట్లో ఉన్న ఇద్దరు మహిళా మంత్రులు పట్టించుకోవడం లేదని, వారంతా సంపాదన మీదే శ్రద్ధ పెట్టారని సత్యవతిరాథోడ్ దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ హయాంలో మహిళలకు భద్రత పెంచారని, వారి రక్షణ కోసం షీటీమ్‌లను ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. నాడు కేసీఆర్ నగరం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, ఈ సర్కార్‌లో అవి పనిచేయడం లేదని ఎద్దేవాచేశారు. రహమత్‌నగర్‌లో మహిళపై జరిగిన లైంగికదాడిని మహిళా మంత్రులు సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి వెంటనే ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించాలని అన్నారు.
రాష్ట్రంలో మహిళా ఐపీఎస్ అధికారులు కూడా సరిగా పని చేయడం లేదని సత్యవతి రాథోడ్ విమర్శించారు. మహిళా అధికారులపట్ల మంత్రుల ప్రవర్తన సరిగా లేదని, ఇక సామాన్య మహిళల పట్ల వారి వైఖరి ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చని వ్యాఖ్యానించారు. మహిళలను కోటీశ్వరులను చేయడం సంగతి పక్కన పెడితే, ముందుగా వారికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టుగానే మహిళలను కూడా మోసం చేస్తున్నదని తూర్పారపట్టారు. మహిళలకు మంచి రోజులు రావాలంటే మళ్లీ కేసీఆరే రావాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి శాంతిభద్రతలను గాలికొదిలేశారని బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రా ఆనంద్ ధ్వజమెత్తారు. గత ఎన్నికల సందర్భంగా మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయ లేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను కూడా ఇద్దరు మంత్రులు అవమానించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు నివేదిత, షకీలారెడ్డి, అనితాప్రభాకర్, కార్పోరేటర్లు హేమ, ప్రసన్న లక్ష్మీ, సునీత పాల్గొన్నారు.