కురవి, నవంబర్ 17 : జూబ్లీహి ల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో చివరిదవుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో సోమవారం మీడియాతో ఆమె మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు అధికారం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గెలుపు కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేసి మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దించారని తెలిపారు. రాష్ట్రంలో వరదలు, వానలతో అన్నివర్గాలు తీవ్రంగా నష్టపోయినా సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అధికార దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.
పది మంది ఎమ్మెల్యేల కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, ఆ పది స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే ఎంత మందికి మంత్రి పదవి ఇస్తారని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు, అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఏ వర్గానికి న్యా యం చేయలేకపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ వాళ్లు కవితతో నిరాధారమైన ఆరోపణలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్, ఈ-కార్ రేసింగ్ ఘటనలను నేటివరకు ప్రభుత్వం తేల్చలేదని, ఈడీ, సీబీఐ, ఏసీబీ పేర్లు తీసుకొస్తూ కేటీఆర్‌ను బద్నాం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదన్నారు.