హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): మహావీర్ సంత్ సేవాలాల్ మహరాజ్ స్ఫూర్తితో గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. పోడు భూములకు రైతుబంధు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కూడా కేసీఆర్‌దేనని ప్రశంసించారు. గిరిజనుల ఆరాధ్యదైవం మహావీర్ సంత్ సేవాలాల్ మహరాజ్ 268వ జయంతిని తెలంగాణభవన్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు.
మాజీ మంత్రులు సత్యవతిరాథోడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాయక్, మెతుకు ఆనంద్, నాయకులు రూప్సింగ్, జాన్సన్‌నాయక్, రామచంద్రునాయక్, గాంధీనాయక్, బీఆర్ఎస్ లంబాడా ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు పలువురు సేవాలాల్ మహారాజ్‌కు పుష్పాంజలి ఘటించారు. అనంతరం సేవాలాల్ మహారాజ్‌కు గిరిజన సంప్రదాయ ప్రకారం భోగ్ భండార్ సమర్పించారు. రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని, కేసీఆర్‌ను అన్ని విధాలా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్‌ను లంబాడా కుల పెద్దలు ప్రార్థించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే మరో సేవాలాల్ అని కీర్తించారు. గిరిజనులకు రిజర్వేషన్ పెంచిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. గవర్నర్ కోటాలో గిరిజనులకు ఎమ్మెల్సీ ఇచ్చే దమ్ము రేవంత్‌రెడ్డికి ఉన్నదా? అని ప్రశ్నించారు. 95 గిరిజన గురుకులాలు ఏర్పాటుచేసి నాణ్యమైన విద్యను అందించారని, రేవంత్‌రెడ్డి పాలనలో అవి అనాథలుగా మారాయని మండిపడ్డారు. మిషన్ భగీరథతో కేసీఆర్ గిరిజన తండాల్లో నీటి కష్టాలు లేకుండా చేశారని గుర్తుచేశారు.
పోడు భూములకు కేసీఆర్ పట్టాలిచ్చి రైతుబంధు కూడా అందజేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. గిరిజనులకు రైతుబంధు ఎగ్గొట్టింది రేవంత్ సర్కార్ అని మండిపడ్డారు. గిరిజనులను అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. కేసీఆర్ కిట్ల పంపిణీని కాంగ్రెస్ సర్కారు బంద్ పెట్టిందని విమర్శించారు.
గిరిజనుల్లో నిర్మాణాత్మక మార్పు వచ్చిందని, అన్ని రంగాల్లో వారు రాణిస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. కేసీఆర్‌పై రేవంత్ చేస్తున్న అడ్డగోలు వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజన సంప్రదాయ దుస్తుల్లో తెలంగాణభవన్‌కు వచ్చారు.
బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా గిరిజన బిడ్డలందరికీ మాజీ మంత్రి హరీశ్‌రావు శనివారం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ మహనీయుడు చూపిన ఆదర్శమార్గంలో మానవ శ్రేయస్సు కోసం మనందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించించి వారిని ఘనంగా గౌరవించుకున్నట్టు గుర్తుచేశారు.