మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 22: తెలంగాణ రైతులపై సీఎం రేవంత్‌కు సోయిలేదని మాజీ మంత్రి సత్యవతి రాథో డ్ విమర్శించారు. శుక్రవారం మహబూబాబాద్ సొసైటీలో ఐదు రోజుల క్రితం టో కెన్లు ఇచ్చినా యూరియా ఇవ్వడంలేదని మానుకోట-తొర్రూరు ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. మాజీ మంత్రి సత్యవతి మద్దతు తెలిపి రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం కాగా.. రేవంత్ పాలనలో ఎక్కడ చూసినా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్తో ఫోన్లో మాట్లాడి టోకెన్లు ఇచ్చిన రైతులకు వెంటనే యూరియా ఇవ్వాలని కోరారు. తండాకు చెందిన ఓ రైతు పురుగులమందు డబ్బాను తన సంచిలో నుంచి బయటకు తీస్తున్న క్రమంలో పక్కనే ఉన్న పోలీసులు గమనించి డబ్బాను లాక్కొని అతడిని పక్కకు పంపించివేశారు. వ్యవసాయ అధికారి విజయనిర్మల, తహసీల్దార్ రాజేశ్వర్ వచ్చి రైతులతో మాట్లాడి సొసైటీ వద్దకు తీసుకుపోయారు.