హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో అంగన్వాడీ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. 15 వేల టీచర్లు, హెల్పర్ పోస్టుల భర్తీలో అవినీతికి తెరలేపారని ఆరోపించారు. ఇంటర్వ్యూ, కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీకి 10 మార్కులు అప్పగించడంలోని ఔచిత్యమేంది? అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సులకోసం కాదా? కాంగ్రెస్ కార్యకర్తలకు అంగన్వాడీ పోస్టులు కట్టబెట్టే కుట్ర కాదా? అని సూటిగా ప్రశ్నించారు.
కాంగ్రెస్ సర్కార్‌కు కీలుబొమ్మల్లా మారిపోయిన కలెక్టర్లకు రిక్రూట్మెంట్ బాధ్యతలు అప్పగించడం శోచనీయమన్నారు. గురువారం తెలంగాణభవన్‌లో మాజీ ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, టీజీపీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రా ఆనంద్, సీనియర్ నేతలు హరిరమాదేవి, మూల విజయారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ పాలనలోనే అంగన్వాడీలకు మేలు జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రం రాకముందు రూ. 4 వేలు ఉన్న టీచర్ల వేతనాన్ని మూడుసార్లు పెంచి రూ. 13,600 చేసిన ఘనత ఆయనకే దక్కిందని గుర్తుచేశారు. ప్రతినెలా ఫస్ట్ వారంలో వేతనాలిచ్చి కడుపు నింపారని కొనియాడారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ అబద్ధపు హామీలిచ్చిందని ధ్వజమెత్తారు.
టీచర్ల వేతనాలను రూ. 18 వేలకు పెంచుతామని, ప్రతినెలా ఫస్ట్ తారీఖున వేతనాలను ఖాతాల్లో జమ చేస్తామని, రిటైర్డ్ సిబ్బందికి, టీచర్లకు రూ. లక్ష, ఆయాలకు రూ. 50 వేలు బెనిఫిట్స్ ఇస్తామని మభ్యపెట్టిందని దుయ్యబట్టారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా ఆ ఊసే ఎత్తకుండా మోసం చేస్తున్నదని మండిపడ్డారు. మంత్రి సీతక్క తొలి సంతకంతోనే మొట్టమొదటి మోసానికి తెరలేపారని ఎద్దేవా చేశారు. వారికి 12 నెలల వేతనాలు ఎగ్గొట్టి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ హయాంలో 8 వేల మంది అంగన్వాడీ సిబ్బందిని పారదర్శకంగా భర్తీ చేశామని చెప్పారు. ఏజెన్సీలో జీవో 3 అమల్లో ఉన్నప్పుడు ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. కానీ ఇప్పుడు జీవో 3ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో స్థానిక కోటా కింద పోస్టులు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి అంగన్వాడీ పోస్టుల భర్తీకోసం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, పాత పద్ధతిలోనే నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ సీఎం అయిన తర్వాతే అంగన్వాడీలకు గుర్తింపు దక్కిందని మాజీ ఎంపీ మాలోత్ కవిత స్పష్టం చేశారు. అంగన్వాడీల శ్రమను గుర్తించి మూడుసార్లు వేతనాలు పెంచారని, పీఆర్సీ వర్తింపజేశారని చెప్పారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్లీ వారి పరిస్థితి మొదటికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పాత రోజులు తీసుకువస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి మాట నిలబెట్టుకొన్నారని చురకలంటించారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్‌లకు చిరునామా అని ఆ పార్టీ పేరును స్కాంగ్రెస్‌గా మార్చుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు.
అంగన్వాడీ పోస్టుల భర్తీని పారదర్శకంగా చేపట్టాలని కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ డిమాండ్ చేశారు. కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీకి మార్కులు వేసే బాధ్యతలు ఇవ్వవద్దని కోరారు. అంగన్వాడీ సిబ్బందికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా సంబురాలు నిర్వహించాలని, బస్సుయాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం సిగ్గుచేటని సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనులకు ఏం ఉద్ధరించారని బస్సుయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ఆరు శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని కొనియాడారు.
తండాలను పంచాయతీలుగా మార్చి, పోడు పట్టాలిచ్చి అడవిబిడ్డలకు సముచిత గౌరవమిచ్చారని చెప్పారు. కేసీఆర్ కేటాయించిన రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నదని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బస్సుయాత్ర చేయాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీలు, లంబాడీల మధ్య చిచ్చుపెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి యత్నిస్తున్నారని ఆరోపించారు. లంబాడీ యూనియన్ల నాయకులు ముఖ్యమంత్రి వలలో పడవద్దని విజ్ఞప్తి చేశారు. రేవంత్‌రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా లంబాడీలు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని హెచ్చరించారు.