కొత్తగూడ/కురవి, డిసెంబర్ 14 : అభివృద్ధిని మరిచి కమీషన్ల కోసం మంత్రులు పాకులాడుతున్నారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, కురవిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశాల్లో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరుచేసిన అభివృద్ధి పనులనే మళ్లీ ప్రారంభించుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ములుగుకు ట్రైబల్ యూనివర్సిటీని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌ది కాదా.. అని ప్రశ్నించారు. ప్రతి మహిళకు రూ. 2,500, పెన్షన్ రూ.4వేలు ఇస్తామన్న హామీని విస్మరించారని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు తులం బంగారం హామీ ఏమైందని ప్రశ్నించారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు కేసీఆర్ హయాంలోనే రూ.100 కోట్లకుపైగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు రూ.75 కోట్లు మంజూరు చేసి, కమీషన్ల కోసం మంత్రులు తుగువులాడుకుంటున్నారని ఎద్దేవాచేశారు. యాసంగి సాగుకు యూరియా లేక రైతులు ఇబ్బందిపడుతుంటే రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడటమేమిటని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ సినిమా సగం అయిపోయిందని చెప్పారు.
పెబ్బేరు, డిసెంబర్ 1 : గ్రామల్లో పారిశుధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ఏర్పాటు చేసిన ట్రాక్టర్లకు కనీసం డీజిల్ పోసి నడిపించలేని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం, యాపర్ల, బూడిదపాడు, శాఖాపురం గ్రా మాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. రెండేండ్లుగా సర్పంచులు లేక గ్రామాలు కూనరిల్లాయని, చెత్త తొలగించేందుకు కనీసం ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేని దుస్థితి నెలకొందని ఆరోపించారు. అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడగుతున్నదని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో సీఎం జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. ఓట్లడగడానికి వచ్చే నాయకులను కాంగ్రెస్ హామీల గురించి ప్రశ్నించాలని సూచించారు. బీఆర్ఎస్ మద్దతుతో పోటీలో ఉన్న అభ్యర్థులు నాగేశ్, వెంకటరెడ్డి, రవీందర్, విజయగౌడ్, సుజాతారవిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.