ములుగు, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు మంత్రి సీతక్క నిర్లక్ష్యం కారణంగా ములుగు జిల్లాలో చిన్నారులు బలవుతున్నారని రెడ్ కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి ఆరోపించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కోతులను చంపేందుకు విషగుళికలు కలిపిన బాలామృతం పెట్టడంతో.. అభంశుభం తెలియని హర్షిత్నందన్ అనే చిన్నారి తిని ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు. ముగ్గురు చిన్నారులు వాటిని తినగా ఇద్దరు చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డారని అన్నారు. కోతులను చంపేందుకు విషం పెట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించినది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు.
పిల్లలు తిరిగే ప్రాంతంలో విష పదార్థాలు పెట్టడం ఎవరి తప్పని, స్వయంగా పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖలను పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క కోతుల నియంత్రణకు విషం పెట్టాలని ఆదేశించారా…? అందుకనే సిబ్బంది వాటిని చంపేందుకు అంగన్వాడీలో దొరకే బాలామృతంలో విష గుళికలు కలిపి పెట్టారా..? అనేది తేల్చాలని అన్నారు. కొన్ని రోజుల క్రితమే రాష్ట్రంలో కోతులు భారీగా చనిపోయిన క్రమంలో జాతీయస్థాయిలో వివాదస్పదం కాగా, మంత్రి సీతక్క పట్టించుకోలేదని తెలిపారు.
మంత్రి నిర్లక్ష్యం వల్లే మరో పసివాడు పాఠశాల పరిసరాల్లో ప్రాణాలు కోల్పోయాడని అన్నారు. కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వ అవినీతి కారణంగా మేడారం పూజారి కుమారుడు కాలు కోల్పోయినట్లు తెలిపారు. మంత్రి సీతక్క శాఖలోని ఆమె సొంత నియోజకవర్గంలో వరుస ఘటనలు జరుగుతున్నా పట్టించుకోకుండా ప్రశ్నించిన బీఆర్ఎస్ పార్టీపై ఎదురు దాడి చేయడం అలవాటుగా మారిందన్నారు. జరుగుతున్న ఘటనలకు సీతక్క బాధ్యత వహించి బాధిత కుటుంబాలను ఆదుకోవడంతోపాటు నియోజకవర్గ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.