హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచుల బిల్లుల చెల్లింపులో కక్షసాధింపునకు పాల్పడవద్దని సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ కోరింది. గ్రామ కార్యదర్శులకు రూ.104 కోట్లు విడుదల చేసినట్టే తమకూ చెల్లించాలని సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ డిమాండ్ చేశారు. తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాసిన బహిరంగ లేఖను సీఎం సహాయ కార్యదర్శి కే వెంకటేశ్వర్రావుకు సోమవారం సచివాలయంలో అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, మెడబోయిన గణేశ్, ఫకీర బీరప్ప, స్వప్నాఅంజయ్యగౌడ్, పూర్ణచంద్రగౌడ్, అరవింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దసరాకైనా బకాయిలు ఇప్పించండి! ; ముఖ్యమంత్రికి కాంట్రాక్టర్ల లేఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): దసరా పండుగకైనా తమ బకాయిలు విడుదల చేయాలని భారత బిల్డర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖల్లో పనిచేసిన సివిల్ పనులకు సంబంధించి దాదాపు రూ. 20 వేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దీనివల్ల కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. దసరా పండుగకు ముందు ప్రతి కాంట్రాక్టర్‌కు కనీసం ఒక బకాయి బిల్లు అయినా చెల్లించాలని లేఖలో కోరారు. దసరా రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పండుగని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఒక్క బిల్లు చెల్లించినా వారికి ఎంతో ఉపశమనం కలిగించడంతో పాటు కుటుంబాలతో ఆనందంగా పండుగ జరుపుకొనే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకొని అనుకూల ఉత్తర్వులు జారీచేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు.