శాయంపేట, డిసెంబర్ 1 : ‘సర్పంచ్ స్థానానికి అభ్యర్థులు స్వతంత్రంగానే పోటీ చేయాలి. పార్టీల మద్దతు తీసుకుంటే కుల బహిష్కరణ చేస్తాం’ అని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారంలోని దళితులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ గ్రామంలో మూడో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్‌గా రిజర్వేషన్ ఖరారైంది. గ్రామంలో పది వార్డు స్థానాలు ఉన్నాయి. పోటీలో ఉండే అభ్యర్థులతో సోమవారం కుల పెద్దలు సమావేశం నిర్వహించారు. అభ్యరుథలు స్వతంత్రంగానే పోటీ చేయాలని, ఏ పార్టీ మద్దతు తీసుకోవద్దని కుల పెద్దలు తీర్మానం చేశారు. పోటీలో ఉండి ఖర్చులతో ఇబ్బంది కావొద్దని, అభ్యర్థి కుటుం బం రోడ్డున పడొద్దని, దీన్ని పాటించకపోతే కుల బహిష్కరణ చేస్తామని కుల పెద్దలు తీర్మానం చేసినట్టు తెలిసింది.
మంథని/మంథని రూరల్, డిసెంబర్ 1: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా మం థని మండలం గాజులపల్లిలో ఇద్దరు అన్నదమ్ములు సర్పంచ్ బరి లో నిలిచారు. గ్రామ పంచాయతీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తాజామాజీ సర్పంచ్‌గా పనిచేసిన కారెంగుల సుధాకర్, ఆయన సోదరుడు కారెంగుల రాజశేఖర్ ఇద్దరు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఒకే ఇంటి నుంచి ఇద్దరు పోటీ చేస్తుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.