హుజూరాబాద్, డిసెంబర్7 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్పంచ్ అభ్యర్థులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి ముద్రకోల రాజు గ్రామంలో గత కొన్నేళ్ల నుంచి టెంట్ హౌస్ నడిపిస్తున్నాడు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాజు, ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు హామీలను పేపర్‌పై రాసి గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్‌గా మారింది. ఇందులో తనను గెలిపిస్తే ఐదేళ్లలో ఒకసారి కోరుకున్న రోజు వాళ్లింట్లో జరిగే కార్యక్రమానికి టెంట్‌హౌస్ సామగ్రి మొత్తం ఉచితంగా అందజేస్తానని హామీ ఇచ్చాడు. అంతేకాకుండా, అతను ఎలక్ట్రిషియన్ కావడంతో కూలర్, ఫ్యాన్, మిక్సీ, గ్యాస్ రిపేర్ ఉచితంగా చేస్తానని పేరొన్నాడు. బతుకమ్మ వేడుకలకు ఉచితంగా మైక్ సెట్ పెడతానని, గ్రామాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని, లేనిపక్షంలో తనను నిలదీయవచ్చునని తెలిపాడు. రాజు హామీలను ప్రజలు ఎంతవరకు లెకలోకి తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నుకున్న ఏకగ్రీవ సర్పంచ్ స్థానాలను రద్దు చేయాలని విశ్వభారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివ వూలందకార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ మంద మకరందుకు వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామానికి లక్షలు, కోట్లు ఇస్తామని ప్రలోభాలకు గురిచేసి, ఏకగ్రీవ ఎన్నికల్లో పాల్గొన్న వారికి, సహకరించిన ఇతర గ్రామస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకుల, అధికారుల అండదండలతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి కొన్ని గ్రామల్లో ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఎన్నికల సంఘాలు ఎందుకు? ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు? అని ప్రశ్నించారు.